మీటూ: టాలీవుడ్‌లో అంతా గ‌ప్‌చుప్‌

Me Too - Tollywood's history
Wednesday, October 10, 2018 - 15:45

ఇపుడు ఇండియా అంతా మీటూ ఉద్య‌మం కొనసాగుతోంది. పెద్ద త‌ల‌కాయ‌లు, పేరొందిన ప్ర‌ముఖ‌ల ఇమేజ్ ఒక్క‌సారిగా పాతాళానికి చేరిపోతోంది. ఈ ఉద్య‌మానికి పురుషులు కూడా, మేల్ స్టార్స్ కూడా మ‌ద్ద‌తు తెలుపుతున్నారు. ఐతే లైంగిక వేధింపుల గురించి నోరు విప్ప‌డం అనేది చాలా కాలంగా ఉంది. ఈ కొత్త శ‌తాబ్దంలో జ‌రిగిన కొన్ని ఉదంతాల‌ను చూద్దాం. 

సినీ పురుషాధిక్య ప్రపంచంలో ఎంత పోరాడినా మహిళకు న్యాయం దక్కుతుందా అనేది మిలియన్ డాలర్ ప్రశ్నే. దర్శకుల నుంచి, కథానాయకుల నుంచి ఎదురయ్యే వేధింపుల గురించి గతంలో కొందరు తెలుగు నాయికలు పెదవి విప్పినా ఎవరూ ఆమెకి మద్దతుగా నిలవలేదు. 

సుబ్బు షూటింగ్ లో దర్శకుడు సురేశ్ వర్మ వేధించాడని సొనాలి జోషి అనే నాయిక మీడియా ముందుకు వచ్చింది. కనీసం ‘మా’ అసోసియేషన్ వాళ్ళు కూడా ఆమెకు అండనీయలేదు. కారణం ఆమె తమ సంఘంలో సభ్యురాలు కాదని నాటి సంఘ నాయకులు నాగార్జున, ఏవీఎస్ లాంటివాళ్ళు చెప్పారు. ఈ విషయాన్ని ప్రశ్నించిన ఓ సినీ వారపత్రికను బహిష్కరించారు. 

ఇక నమిత తెలుగు నటించిన తొలి సినిమా సమయంలోనూ దర్శకుడి శ్రీనువైట్ల‌తో ఇబ్బందులు పడిందని నాడు చెవులుకొరుక్కున్నారు. న‌మిత వైట్ల‌పై పోలీసు స్టేష‌న్‌లో కేసు కూడా వేసేందుకు సిద్ద‌మైంది. ఇదంతా అప్ప‌ట్లో మీడియాలో వ‌చ్చింది. 

మనసు మాట వినదు షూటింగ్ విదేశాల్లో చేసినప్పుడు నవదీప్ వేధింపులకు పాల్పడ్డాడని ఆ చిత్ర హీరోయిన్ అంకిత వెల్లడించింది. విదేశాల నుంచే మీడియాతో మాట్లాడి బావురుమంది. ఆ చిత్ర బృందం హైదరాబాద్ వచ్చి అలాంటిదేమీ లేదు అంటూ నవదీప్ కు క్లీన్ చిట్ ఇచ్చింది. 

అప్పారావు డ్రైవింగ్ స్కూల్ షూటింగ్ లో మాళవికతో రాజేంద్ర ప్రసాద్ అభ్యంతరకరంగా ప్రవర్తించండం గోలైంది. ఒక ముద్దు సీన్ల న‌టిస్తుండ‌గా రాజేంద్ర‌ప్ర‌సాద్ అదే అడ్వాంటేజ్‌గా తీసుకొని ఆమె పెద‌విని కొర‌కాడ‌ని ఆమె అపుడు ఆరోపించింది.  

ఇవి మన తెలుగులో ఉన్న కొన్ని ఘటనలు మాత్రమే.  కథానాయికలకే కాదు గాయనీలకు ఇలాంటి వేధింపులు తప్పడం లేదు అనేది బహిరంగ రహస్యమే. ఫేవర్స్ అడిగే స్వరకర్తలు ఉన్నారు. 

కేరళలోనే కాదు దేశవ్యాప్తంగా కలకలం రేపిన దిలీప్ ఉదంతంలో – బాధితురాలైన నాయికకు ఇప్పటికీ ఊరట కలగలేదు. పోలీస్ కేసులైనా అక్కడి నటుల సంఘం నుంచి దిలీప్ ను బహిష్కరించేందుకు అక్కడి అగ్ర కథానాయకులు ఒప్పుకోవడం లేదు. దీన్ని రేవతి, పద్మప్రియ లాంటి సీనియర్ నటీమణులు ప్రశ్నించినా స్పందన లేదు.  

శ్రీ రెడ్డి గొడవ చేసినప్పుడు కూడా సినీ రంగం, మా సరిగా వ్యవహరించలేదు అనే విమర్శలు వచ్చాయి. ఇందులు శ్రీ రెడ్డి స్వీయ తప్పిదాలు ఎక్కువ ఉండటంతో ఆమె సమస్య, వివాదం పక్కదోవపట్టాయి. మీడియా సైతం అదో టీయార్పీ అంశంగానే భావించింది.