తలసానితో మెగా మీటింగ్

Mega meeting at Chiranjeevi's residence with Talasani
Thursday, May 21, 2020 - 13:15

కరోనాతో కలిసి జీవించాలి. బతుకును బంద్ పెట్టుకోవద్దు అన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. అందుకే లాక్డౌన్ లో చాలా సడలింపులిచ్చారు. ఐతే షూటింగ్ లకి ఇంకా పర్మిషన్ రాలేదు. ఈ నేపథ్యంలో ఇకపై షూటింగ్లు ఎలా చెయ్యాలి. భౌతిక దూరం ఎలా పాటించాలి వంటివి చర్చించి, ప్రభుత్వానికి నివేదించేందుకు మెగాస్టార్ చిరంజీవి తన ఇంట్లో భారీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. శుక్రవారం ఉదయం మొదలైంది.

ఈ సినీ ప్రముఖుల అభిప్రాయాలను తెలుసుకునేందుకు  సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మెగాస్టార్ ఇంటికి వచ్చారు.

చిరంజీవి, నాగార్జున, అరవింద్,సురేష్ బాబు, సి.కళ్యాణ్, దిల్ రాజు, జెమిని కిరణ్, శ్యామ్ ప్రసాద్ రెడ్డి, దర్శకులు రాజమౌళి, వినాయక్, త్రివిక్రమ్ శ్రీనివాస్, N. శంకర్, కొరటాల శివ, ఇంకా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. "షూటింగ్ చేసుకునేందుకు మనకు ఎవరి అనుమతి అవసరం లేదు. కానీ ఇది ప్రత్యేక పరిస్థితి. కరోనా మహమ్మారి మన జీవితాలను మార్చేసింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వాల పర్మిషన్ తప్పనిసరి. అందుకే ఈ సమావేశం," అని చిరంజీవి మీటింగ్ ని మొదలు పెట్టారు. 

"అన్ని సన్నివేశాలకు భారీగా జనం అవసరం లేదు. తక్కువ మందితో కూడా చాలా సీన్లు తీయొచ్చు. ప్రభుత్వం అనుమతి ఇస్తే.. ముందు ఓకే టెస్ట్ షూట్ చేస్తాం. అన్ని గైడ్ లైన్స్ పాటిస్తూ చేసుకుంటామ"ని రాజమౌళి కోరారు.