మెగాస్టార్ పోస్ట్ చేసిన మొట్టమొదటి ఫొటో

Megastar shares selfie with mother
Wednesday, March 25, 2020 - 18:00

ఉగాది సందర్భంగా సోషల్ మీడియాలోకి ఎంటరయ్యారు చిరంజీవి. లేటుగా వచ్చినా లేటెస్ట్ గా అదరగొట్టారు. చిరు రాకతో సోషల్ మీడియాలో ఓ చిన్నపాటి పండగ వాతావరణం నెలకొంది. ఓవైపు కరోనా భయాలు ప్రజల మనసుల్లో గూడుకట్టుకున్నప్పటికీ, చిరంజీవి ట్విట్టర్ లోకి వచ్చారనే వార్తతో చాలామంది ఖుషీ అయ్యారు. ఇదిలా ఉండగా, సోషల్ మీడియాలో తన తొలి ఫొటో షేర్ చేశారు మెగాస్టార్.

ఇనస్టాగ్రామ్ లో ఖాతా తెరిచిన మెగాస్టార్.. తన తల్లితో సెల్ఫీ దిగి ఆ ఫొటోను పోస్ట్ చేశారు. సోషల్ మీడియాలో చిరంజీవి అధికారికంగా పోస్ట్ చేసిన మొట్టమొదటి ఫొటో ఇదే కావడం విశేషం. హోమ్ టైమ్.. మామ్ టైమ్ అంటూ చిరంజీవి పెట్టిన కామెంట్ కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

చిరంజీవి పోస్ట్ చేసిన ఈ సెల్ఫీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక్కడ కూడా సామాజిక బాధ్యత మరవలేదు మెగాస్టార్. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాను అవగాహన-బాధ్యతతో ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు, పెద్దోళ్లను జాగ్రత్తగా చూసుకోవాలని కోరారు.