తమిళ్ రాకర్స్ ఇప్పుడిలా రెచ్చిపోతోంది

A movie piracy site now uploading OTT series
Wednesday, May 6, 2020 - 17:00

సినిమా థియేటర్లలోకి రావడమే ఆలస్యం. పైరసీ రెడీ అయిపోతుంది. మరీ ముఖ్యంగా తమిళ్ రాకర్స్ అనే సంస్థ ఈ విషయంలో చాలా ఫాస్ట్ గా ఉంది. విశాల్ లాంటి హీరోల్ని ఛాలెంజ్ చేసి మరీ వీళ్లు సినిమాల్ని పైరసీ చేసిన ఘటనలు ఉన్నాయి. మరి ఇప్పుడు వీళ్లు ఏం చేస్తున్నారు. లాక్ డౌన్ తో సినిమాలు రిలీజ్ అవ్వడం లేదు, థియేటర్లు మూసేశారు. మరో నెల రోజుల వరకు సినిమా సందడి ఉండకపోవచ్చు. మరి తమిళ రాకర్స్ పరిస్థితేంటి?

సరిగ్గా ఇక్కడే రూటు మార్చారు వీళ్లు. ఇన్నాళ్లు సినిమాల్ని పైరసీ చేసిన తమిళ రాకర్స్ బృందం ఇప్పుడు వెబ్ సిరీస్ ను పైరసీ చేయడం స్టార్ట్ చేశారు. అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్, హాట్ స్టార్, జీ5.. ఇలా ఏ ఓటీటీని వదలకుండా అన్ని లేటెస్ట్ వెబ్ సిరీస్ ను పైరసీ చేసి పెట్టడం మొదలుపెట్టారు.

తాజాగా రిలీజైన మిసెస్ సీరియల్ కిల్లర్ అనే సిరీస్ కూడా తమిళ్ రాకర్స్ లోకి వచ్చేసింది. మనోజ్ బాజ్ పాయ్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ లాంటి బాలీవుడ్ నటులు ఇందులో నటించారు. మొన్నటివరకు పైరసీతో తమకు సంబంధం లేదని సంబరపడిన ఓటీటీ జనాలు ఇప్పుడు తలలు పట్టుకున్నారు.