నా రికార్డు తొందరగా బద్దలవ్వాలి

My records should be broken, Allu Arjun
Sunday, February 2, 2020 - 08:45

ఏ హీరో అయినా తమ రికార్డులు పది కాలాల పాటు చల్లగా ఉండాలని కోరుకుంటారు. ఎన్ని సినిమాలొచ్చినా, ఎన్నేళ్లు గడిచినా తమ రికార్డు చెక్కుచెదరకూడదని అనుకుంటారు. కానీ అల్లు అర్జున్ మాత్రం తన రికార్డు తొందరగా బద్దలవ్వాలని కోరుకుంటున్నాడు. ఎవరో ఒక హీరో వచ్చి తన రికార్డును చెల్లాచెదురు చేయాలని ప్రకటించాడు. దీనికి అతడు రీజన్ కూడా చెబుతున్నాడు.

"రికార్డ్స్ కొట్టినందుకు చాలా ఆనందంగా ఉంది. అయితే ఇదొక దాటుకుంటూ వెళ్ళిపోయే దశ. ఒక్కొక్కళ్ళు ఒక్కో టైంలో రికార్డ్ కొడతారు. ఈ రికార్డు ఎంత త్వరగా బద్దలు కొడితే ఇండస్ట్రీ అంత ముందుకు వెళ్లినట్టు. తెలుగు సినిమా మరో మెట్టు ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నాను."

చూశారుగా.. ఇది బన్నీ వెర్షన్. అలా తన రికార్డు తొందరగా బద్దలైపోతే.. ఇండస్ట్రీ మరింత ముందుకెళ్లినట్టు అర్థం అంటున్నాడు అల్లు అర్జున్. ఇతడు ఏ ఉద్దేశంతో చెప్పాడో కానీ, అదే జరగబోతోంది. బన్నీ రికార్డు ఎక్కువ రోజులు నిలబడే పరిస్థితులైతే కనిపించడం లేదు.

చిరంజీవి-కొరటాల కాంబోలో సినిమా వస్తోంది. అటు ప్రభాస్ కూడా కొత్త సినిమా రెడీ చేస్తున్నాడు. అంతెందుకు.. చరణ్-తారక్ కలిసి ఆర్-ఆర్-ఆర్ చేస్తున్నారు. ఇవన్నీ ఏడాదిన్నరలోపే థియేటర్లలోకి వస్తున్నాయి. సో.. మరో ఏడాదిన్నర మాత్రమే బన్నీ రికార్డు పదిలంగా ఉంటుందన్నమాట. ఈ 3 సినిమాల్లో ఏదో ఒకటి బన్నీ రికార్డును బద్దలుకొట్టడం ఖాయంగా కనిపిస్తోంది.