మైత్రీకి మిడిల్‌తో ఫిడేల్‌!

Mythri gets series of flops with middle-range movies
Monday, September 23, 2019 - 18:45

మొదటి సినిమా... శ్రీమంతుడు. ఆల్‌టైమ్‌ బ్లాక్‌బస్టర్‌
రెండో సినిమా...జనతా గ్యారేజ్‌.. మరో బిగ్‌ బ్లాక్‌బస్టర్‌
మూడో సినిమా రంగస్థలం... బాహుబలి చిత్రాల తర్వాత అతిపెద్ద బ్లాక్‌బస్టర్‌

రెండు ఏళ్లల్లోనే ఇలాంటి కళ్లు చెదిరే హిట్స్‌ అందించి.. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మాణ సంస్థ సంచలనం సృష్టించింది. అగ్ర నిర్మాణ సంస్థలుగా ఉన్న దిల్‌రాజు బ్యానర్‌, అల్లు అరవింద్‌ బ్యానర్‌, సురేష్‌ ప్రొడక్షన్స్‌లకి మైండ్‌బ్లాంక్‌ అయ్యేలా చేసింది ఈ సంస్థ. అయితే అన్నీ సినిమాలు పెద్ద హీరోలతోనే చేయలేం కాబట్టి... మిడిల్‌ రేంజ్‌ హీరోలతో వరుసపెట్టి సినిమాలను తీసింది. కానీ అక్కడే దెబ్బ పడింది.

ఫస్ట్‌ ఝలక్‌ నాగ చైతన్య ఇచ్చాడు. ఎంతో హంగామగా తీసిన సవ్వసాచి కుడి ఎడమలా వాయించింది.  చైతన్య కన్నా నేను సీనియర్‌ని కాబట్టి తనకంటే పెద్ద ఫ్లాప్‌ ఇస్తానని కంకణం కట్టుకున్నాడు కాబోలు.. అమర్‌ అక్బర్‌ ఆంటోనీతో మైత్రీ పరువు తీశాడు. బాప్‌ ఆఫ్‌ డిజాస్టర్‌ అనిపించుకొంది ఆ మూవీ. 

ఆ తర్వాత సాయిధరమ్‌ తేజ హీరోగా రూపొందిన చిత్రలహరి.. బ్రేక్‌ ఈవెన్‌తో మమ అనిపించుకొంది. ఇక ఫామ్‌లో ఉన్న విజయ్‌ దేవరకొండతో ఫ్లాప్‌ల తెరకి ఎండ్‌కార్డ్‌ వేద్దామని ప్రయత్నించింది మైత్రీ. అయితే అది కూడా కలిసి రాలేదు. లేటెస్ట్‌గా హాటెస్ట్‌గా నేచురల్‌ స్టార్‌ నాని హీరోగా గ్యాంగ్‌ లీడర్‌ని రిలీజ్‌ చేస్తే అది కూడా బోల్తా కొట్టింది. అంటే రంగస్థలం తర్వాత మరో బ్లాక్‌బస్టర్‌ లేదు ఈ సంస్థకి. 

అంటే మిడిల్‌ రేంజ్‌ హీరోల చిత్రాల ఈ బ్యానర్‌కి ఫిడేల్‌ వాయించుకున్నట్లయింది.