జబర్దస్త్ నుంచి తప్పుకున్న నాగబాబు

Naga Babu comes out of Jabardasth show
Friday, November 22, 2019 - 10:00

మోస్ట్ రేటెడ్ షో జబర్దస్త్ నుంచి నాగబాబు తప్పుకున్నారట. కేవలం రెమ్యూనరేషన్ తక్కువగా ఇవ్వడం వల్లనే తప్పుకున్నారట. ఇలా చాలా గాసిప్స్ నడిచాయి. వీటన్నింటికీ నాగబాబు సమాధానం ఇచ్చారు. ఏకంగా ఓ వీడియో రిలీజ్ చేశారు.

జబర్దస్త్ నుంచి తను తప్పుకున్న మాట వాస్తవమని ప్రకటించారు నాగబాబు. నిన్న వచ్చిన ఎపిసోడ్ తో పాటు.. ఈరోజు రాత్రికి ప్రసారమయ్యే జబర్దస్త్ లో మాత్రమే తను కనిపిస్తానని స్పష్టంచేశారు. ఇంకా చెప్పాలంటే ఇవాళ్టి కార్యక్రమంతో జబర్దస్త్ కు తనకు బంధం తెగిపోయిందని తెలిపారు.

దాదాపు ఏడేళ్లుగా తన జబర్దస్త్ ప్రయాణం సాగిందని చెప్పిన నాగబాబు.. మల్లెమాల సంస్థ నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డికి థ్యాంక్స్ చెప్పారు. ఇన్నాళ్లూ తనకు బాగానే పారితోషికం ఇచ్చారని, కానీ అది తన స్థాయికి తగ్గ రెమ్యూనరేషన్ కాదని కుండబద్దలుకొట్టారు. అయినా తను రెమ్యూనరేషన్ విషయంలో తప్పుకోవడం లేదని కూడా స్పష్టంచేశారు.

జీ తెలుగు ఛానెల్ లో ఓ కార్యక్రమం చేశారు నాగబాబు. జబర్దస్త్ తో డీల్ పెట్టుకొని జీ తెలుగులో ఎలా కనిపిస్తారంటూ మల్లెమాల సంస్థ వాదించింది. దీనికి సంబంధించి ఈటీవీతో కలిసి కేసు కూడా వేసింది. పైగా జీ తెలుగులో రాబోతున్న ఓ కార్యక్రమం కూడా జబర్దస్త్ తరహాలోనే ఉందని, కాపీరైట్ కింద కేసు వేసింది. ఆ కేసులో తీర్పు జీ తెలుగుకు అనుకూలంగా వచ్చింది.

కేసు తీర్పు అనుకూలంగా రావడంతో నాగబాబు గెస్ట్ గా చేసిన "సరె సర్లే ఎన్నో అనుకుంటాం" అనే కార్యక్రమాన్ని అధికారికంగా ప్రకటించింది ఛానెల్. ఈనెల 24న సాయంత్రం 6 గంటలకు ప్రసారం అవుతుందని తెలిపింది. ఈ మేరకు 5 నిమిషాల నిడివితో ఓ వీడియోను కూడా రిలీజ్ చేసింది. ఇందులో నాగబాబుతో పాటు జబర్దస్త్ కు చెందిన చాలామంది నటులున్నారు. అంటే.. వీళ్లంతా జబర్దస్త్ నుంచి తప్పుకున్నట్టే. త్వరలోనే వీళ్లందరితో జీ తెలుగులో ఓ కామెడీ షో ప్లాన్ చేస్తున్నారట.