నాగబాబు సీరియల్ ఆఖరి వీడియో

Naga Babu ends his rant against Jabardasth team
Thursday, December 5, 2019 - 16:45

జబర్దస్త్ నుంచి తను ఎందుకు వైదొలిగానే చెబుతూ, కొన్ని రోజులుగా సీరియల్ టైపులో వీడియోలు పెడుతూనే ఉన్నారు నాగబాబు. ఆ సీరియల్ కు సంబంధించి ఆఖరి వీడియోను తాజాగా పోస్ట్ చేశారు. అందులో కాస్త సుతారంగానే జబర్దస్త్ ప్రొడ్యూసర్ శ్యామ్ ప్రసాద్ రెడ్డికి చీవాట్లు వేశారు.

27 నిమిషాల పాటు సుదీర్ఘంగా మాట్లాడిన నాగబాబు.. మల్లెమాల కార్పొరేట్ స్టయిల్ నచ్చకే తను జబర్దస్త్ నుంచి బయటకు వచ్చేయడానికి ప్రధాన కారణమని ఆరోపించారు. శ్యామ్ ప్రసాద్ రెడ్డి కేవలం కార్పొరేట్ వ్యక్తిగానే ఆలోచించారు తప్ప, మానవతా కోణంలో ఆలోచించలేదన్నారు.

ఇక కంటెస్టంట్ల విషయానికొస్తే.. క్రియేటివ్ ఫీల్డ్ లో ఉన్నవాళ్లను అగ్రిమెంట్ పేరిట తొక్కిపెట్టడం సరికాదన్నారు నాగబాబు. జబర్దస్త్ కంటెస్టెంట్ల విషయంలో శ్యామ్ ప్రసాద్ రెడ్డి ఎంత అన్యాయం చేస్తున్నారో తనకు తెలుసని, అవన్నీ బయటపెట్టనని అన్నారు. అయితే ఓ కార్పొరేట్ వ్యక్తిగా శ్యామ్ ప్రసాద్ ఆలోచనను తను తప్పుబట్టనంటూ సర్దిచెప్పారు. ఇలా వాత పెడుతూనే వెన్న పూశారు.

ఫైనల్ గా తను త్వరలోనే జీ తెలుగులో కనిపిస్తానని తెలిపిన నాగబాబు.. ప్రస్తుతం జబర్దస్త్ లో ఉన్న మరికొంతమంది కూడా జీ తెలుగులోకి వస్తారని, వాళ్ల పేర్లు అప్పుడే చెప్పడం భావ్యం కాదంటూ ముగించారు.

అయితే తన మొత్తం ప్రసంగంలో హైపర్ ఆది, సుడిగాలి సుధీర్ జీ తెలుగు వైపు వస్తారనే విషయాన్ని చూచాయగా ఆయన చెప్పేయడం కొసమెరుపు. నాగబాబు భోలా మనిషి. మనసులో ఏదీ దాచుకోలేరు. ఈ విషయాన్ని కూడా అలానే బయటపెట్టేశారు.