అన్నంత పని చేస్తున్న నాగబాబు

Naga Babu's Adirindi slowly gaining popularity
Sunday, January 19, 2020 - 10:15

జబర్దస్త్ కు పోటీగా అదిరింది కార్యక్రమాన్ని తెరపైకి తీసుకొచ్చారు నాగబాబు. మల్లెమాల నుంచి బయటకొచ్చి జీ తెలుగు ఛానెల్ లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అచ్చుగుద్దినట్టు ఈటీవీ జబర్దస్త్ ను మక్కికిమక్కి దించేసిన ఈ కార్యక్రమం, ఇప్పుడు మెల్లమెల్లగా జబర్దస్త్ కు పోటీ ఇవ్వడం ప్రారంభించింది.

ఏడేళ్ల నుంచి అప్రతిహతంగా వస్తున్న జబర్దస్త్, ఆడియన్స్ మనసుల్లో పాతుకుపోయింది. ఇక దాన్ని కొట్టడం అసాధ్యం అనుకున్నారంతా. కానీ చాపకింద నీరులా నాగబాబు చేస్తున్న "అదిరింది" కార్యక్రమం విస్తరిస్తూనే ఉంది. మెల్లగా "జబర్దస్త్"ను కమ్మేస్తూనే ఉంది.

తాజా రేటింగ్స్ లో జబర్దస్త్ కు 6.80 టీఆర్పీ వస్తే.. అదిరింది కార్యక్రమానికి 2.28 టీఆర్పీ వచ్చింది. నిజానికి ఈ రెండు రేటింగ్స్ మధ్య వ్యత్యాసం ఉన్నప్పటికీ.. ఈ కార్యక్రమాల చరిత్రతో పోల్చి చూసుకుంటే ఇది చాలా తక్కువ. జబర్దస్త్ కు ఒకానొక టైమ్ లో 15 టీఆర్పీ వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి.

ఇక "అదిరింది" కార్యక్రమం విషయానికొస్తే, ఇది ఈమధ్యే ప్రారభమైంది. మెల్లమెల్లగా బుల్లితెర వీక్షకుకు దగ్గరౌతోంది. కాబట్టి మరికొన్ని వారాలు గడిస్తే, జబర్దస్త్ కు పోటీ నిచ్చే స్థాయికి నాగబాబు కార్యక్రమం చేరుకుంటుందని భావిస్తున్నారు.