మరీ ఇంత సింపులా చైతూ!

Naga Chaitanya's poor boy look
Wednesday, March 4, 2020 - 18:45

అక్కినేని హీరో అంటే ఎలా ఉండాలి. అమ్మాయిలకు నిద్ర లేకుండా చేయాలి. స్టయిల్ ఐకాన్ గా ఉండాలి. నాగచైతన్యలో దాదాపు ఇవే ఫీచర్స్ కనిపిస్తాయి. ఏఎన్నార్ నుంచి నాగార్జున, చైతూ, అఖిల్, సుశాంత్.. ఇలా చాలామంది అందగాళ్లు ఉన్నారు ఆ కాంపౌండ్ లో. ఈ హీరోలెవరూ డీ-గ్లామరైజ్డ్ పాత్రలు పోషించరు. అది వాళ్ల ఇమేజ్ కే భంగం. కానీ నాగచైతన్య మాత్రం అలాంటి పాత్రలో కనిపించబోతున్నాడు.

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టోరి అనే సినిమా చేస్తున్నాడు చైతూ. ఇందులో అతడు పేద కుర్రాడిగా డీ-గ్లామరైజ్డ్ రోల్ పోషిస్తున్నాడనే విషయం తెలిసిందే. రీసెంట్ గా విడుదలైన వీడియోలో కూడా చైతూను ఆడియన్స్ చూశారు. కానీ అంతకంటే పూర్ లుక్ ఒకటి తాజాగా బయటపడింది. ఆ లుక్ లో చైతూ ఎలా ఉన్నాడంటే, ఒక్క ముక్కలో చెప్పాలంటే పేదరికానికి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నాడు.

దేవి, సుదర్శన్ థియేటర్లకు చెందిన ఓనర్లు, వాళ్ల స్టాఫ్ తో కలిసి లవ్ స్టోరీ సెట్స్ కు వచ్చారు. నాగచైతన్యను గౌరవ పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బయటకొచ్చిన స్టిల్స్ లో నాగచైతన్య చాలా డీ-గ్లామరైజ్డ్ గా కనిపించాడు. అతడి ముఖానికి కనీసం మేకప్ కూడా లేదు. ఆ కాస్ట్యూమ్స్ గురించైతే ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది.

లవ్  స్టోరి సినిమాలో నాగచైతన్య తెలంగాణకు చెందిన ఓ పేద యువకుడి పాత్రలో కనిపించబోతున్నాడనే విషయం అందరికీ తెలుసు కానీ, మరీ బీదగా, పేదరికం కొట్టొచ్చేలా, ఇంత సహజంగా చైతూను కమ్ముల చూపిస్తాడని మాత్రం ఎవ్వరూ ఊహించలేదు.