అది ఇదేనా నాగశౌర్య!

Naga Shaurya's old film launched again?
Saturday, February 29, 2020 - 08:45

దాదాపు రెండేళ్ల కిందటి సంగతి. అప్పట్లో భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై ఓ సినిమా చేస్తున్నాడు నాగశౌర్య. హీరోయిన్ ఈషా రెబ్బా. దర్శకుడు రాజా కొలుసు. షూటింగ్ కూడా దాదాపు 50శాతం జరిగింది. ఏమైందో సడెన్ గా సినిమా ఆగిపోయింది. దర్శకుడు-నిర్మాత మధ్య గొడవంటూ వార్తలొచ్చాయి. కారణం ఏమైతేనేం ప్రాజెక్టు ఆగిపోయింది. అట్నుంచి అటు నర్తనశాల సినిమాకు షిఫ్ట్ అయ్యాడు శౌర్య.

కట్ చేస్తే, ఇప్పుడు అదే దర్శకుడితో సినిమా లాంఛ్ చేశాడు శౌర్య. నిన్న రామానాయుడు స్టుడియోస్ లో ఈ సినిమా లాంఛ్ అయింది. కల్యాణ్ రామ్, దిల్ రాజు, హరీష్ శంకర్ లాంటి ప్రముఖులు కూడా హాజరయ్యారు. ఈ ఈవెంట్ తో అప్పటి సినిమా ఇప్పుడు మరోసారి తెరపైకొచ్చింది. చర్చనీయాంశంగా మారింది.

అప్పట్లో ఆగిపోయిన ప్రాజెక్టునే ఇప్పుడు నాగశౌర్య కొత్తగా స్టార్ట్ చేసి ఉండొచ్చు. ఎందుకంటే అదే దర్శకుడితో సినిమా కాబట్టి, కథ అతడిదే కాబట్టి స్టోరీలైన్ మారకపోవచ్చు. పైగా అప్పుడు శౌర్య చేసిన జానర్ యాక్షన్ సబ్జెక్ట్ అయితే, ఇప్పుడు ప్రారంభమైన సినిమా కూడా యాక్షన్ జానరే. మ్యూజిక్ డైరక్టర్ (మహతి స్వరసాగర్) కూడా సేమ్ టు సేమ్.

దీంతో ఆ సినిమానే ఇప్పుడు ఫ్రెష్ గా లాంఛ్ చేసి ఉండొచ్చని చాలామంది భావిస్తున్నారు. మరి ఇది ఆ సినిమాయేనా, లేక వీళ్ల కాంబోలో కొత్త కథతో మరో సినిమానా అనే విషయాన్ని నాగశౌర్యే చెప్పాలి. అన్నట్టు అప్పట్లో రాజా కొలుసుగా పేరు వేయించుకున్న ఈ దర్శకుడు, ఈసారి మాత్రం కేపీ రాజేంద్ర అనే పేరుతో తెరపైకొచ్చాడు. సినిమా ఇండస్ట్రీలో ఇలాంటివి కామనే.