ఓటీటీ... గెటౌట్ అన్న నాగ్

Nagarjuna filres on OTT proposal
Saturday, July 25, 2020 - 18:15

లాక్ డౌన్ తో థియేటర్లన్నీ మూతపడ్డంతో ఓటీటీ జనాలు విజృంభిస్తున్నారు. కుదిరితే పెద్ద సినిమాలు, కుదరకపోతే చిన్న సినిమాల్ని కొనేసి తమ ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో బడా సినిమాల కోసం గట్టిగా ప్రయత్నిస్తున్న ఓటీటీలు కూడా ఉన్నాయి. ఇందులో భాగంగా అఖిల్ సినిమా కోసం ప్రయత్నించిన ఓ మధ్యవర్తికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది.

ప్రస్తుతం "మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్" అనే సినిమా చేస్తున్నాడు అఖిల్. గీతాఆర్ట్స్-2 బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమా ఇంకా షూటింగ్ స్టేజ్ లో ఉంది. మళ్లీ ఎప్పుడు షూటింగ్ స్టార్ట్ అవుతుందో తెలియదు. ఒకవేళ షూటింగ్ పూర్తయినా, ఎప్పుడు థియేటర్లలోకి వస్తుందో తెలియదు. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ఓ మధ్యవర్తి నాగార్జునను అప్రోచ్ అయ్యాడు. అల్లు అరవింద్ కే "ఆహా" అనే వెబ్ అప్ ఉంది.

ఐనా ఓ పెద్ద ఓటీటీ సంస్థతో తను మాట్లాడతానని, అఖిల్ సినిమాను వాళ్లకు ఇచ్చేలా అల్లు అరవింద్ తో మాట్లాడాలని బేరం పెట్టాడు సదరు మధ్యవర్తి. నిజానికి ఈ మధ్యవర్తి నేరుగా వెళ్లి ఇదే ప్రతిపాదనను అల్లు అరవింద్ ముందు పెట్టొచ్చు. కానీ ఇద్దరి మధ్య మంచి సంబంధాల్లేవు. అందుకే నాగార్జున నుంచి నరుక్కొచ్చే ప్రయత్నం చేశాడు.

అయితే ఈ ప్రపోజల్ ఇలా పెట్టడమే ఆలస్యం భగ్గుమన్నాడట నాగ్. వెంటనే ఇక్కడ్నుంచి వెళ్లిపోవాలంటూ (గెటౌట్ అని అర్థం వచ్చేలా) గట్టిగా అరిచాడట. ఊహించని రియాక్షన్ రావడం, పైగా కూల్ గా ఉండే నాగ్ నుంచి ఇలాంటి స్పందన రావడంతో సదరు మధ్యవర్తి కామ్ గా అక్కడ్నుంచి జారుకున్నాడు.