నారా రోహిత్ చేపల పులుసు

ఈ హీరో మంచి భోజనప్రియుడు అనే విషయం సినీప్రియులందరికీ తెలుసు. తన భోజన ప్రియత్వాన్ని మరోసారి చాటుకున్నాడు నారా రోహిత్. "శమంతకమణి" షూటింగ్ బ్రేక్ లో యూనిట్ సభ్యుల కోసం ఏకంగా చేపల పులుసు వండి వార్చాడు.
శమంతకమణి సినిమాలో పోలీస్ పాత్ర చేస్తున్నాడు నారా రోహిత్. అదే గెటప్ తో గరిట పుచ్చుకున్నాడు. మసాలాలు అన్నీ మిక్స్ చేసి ఎంచక్కా చేపల పులుసు వండేశాడు. చివర్లో ఎలా వచ్చందో చూద్దామని తనే చేతిలో వేసుకొని రుచి కూడా చూశాడు. ఈ మొత్తం ఎపిసోడ్ ను శమంతకమణి యూనిట్ పనిలో పనిగా తమ సినిమా ప్రచారానికి కూడా వాడేస్తోంది.
శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నలుగురు హీరోలు నటిస్తున్న విషయం తెలిసిందే. నారా రోహిత్ తో పాటు ఆది, సుధీర్ బాబు, సందీప్ కిషన్ ఇందులో హీరోలు. వీళ్లలో ఒకరితో ఒకరికి సంబంధం ఉండదు. శమంతకమణి అనే కారు చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది. ఓ కీలక పాత్రలో రాజేంద్రప్రసాద్ కూడా కనిపించనున్నాడు. మరి ఈ చేపల పులుసు ప్రచారం శమంతకమణికి ఏ మేరకు కలిసొస్తుందో చూడాలి.
- Log in to post comments