ఇక క‌మ‌లనయ‌నానందం!

Nayanathara confirmed as Kamal Haasan's heroine?
Tuesday, January 30, 2018 - 23:45

క‌మ‌ల్‌హాస‌న్ రాజ‌కీయాల్లోకి ఎంట్రీ ఇవ్వ‌నున్నారు. ఆయ‌న ఏజ్ పెరిగిపోతోంది. దాంతో సినిమాల‌ను త‌గ్గించుకుంటున్నారు. ఐతే త‌న రాజ‌కీయాల‌కి హెల్స్ అవుతుంద‌నే ఉద్దేశంతో భార‌తీయుడు 2 సినిమాని మాత్రం చేయాల‌ని ప‌ట్టుద‌ల‌గా ఉన్నారు. ఈ సినిమాలో క‌మ‌ల్ స‌ర‌స‌న న‌య‌న‌తార న‌టించ‌నుంద‌ట‌. న‌య‌న‌తార‌ని ద‌ర్శ‌కుడు శంక‌ర్ ఒప్పించ‌న‌ట్లు స‌మాచారం. 

న‌య‌న‌తార ప్ర‌స్తుతం కోలీవుడ్‌లో నెంబ‌ర్‌వ‌న్ హీరోయిన్‌. సినిమాకి మూడు కోట్ల రూపాయ‌లు తీసుకుంటోంది. ఆమె డేట్స్ దొర‌క‌డం అంత ఈజీ కాదు. శంక‌ర్ సినిమాకి హీరోయిన్లు కూడా ఏడాది పాటు డేట్స్ ఇవ్వాలి. ఎపుడంటే అపుడు డేట్స్ ఇవ్వ‌గ‌ల‌ద‌న్న ఉద్దేశంతోనే ఐ, 2 పాయింట్ జీరో సినిమాల్లో యామీ జాక్స‌న్‌ని హీరోయిన్‌గా తీసుకున్నాడు శంక‌ర్‌. న‌య‌న‌తార అన్ని డేట్స్ ఇచ్చేందుకు ఒప్పుకోదు. ఐతే ఆమెకి ఐదు కోట్ల రూపాయ‌లు ఇచ్చేందుకు రెడీ అన్నాడ‌ట శంక‌ర్‌. అలా ఆమె అంగీక‌రించిన‌ట్లు టాక్‌. న‌య‌న‌తార‌నే తీసుకోడానికి రీజ‌న్ ఉంది. 

క‌మ‌ల్‌హాస‌న్‌, శంక‌ర్ కాంబినేష‌న్‌లో రెండు ద‌శాబ్దాల క్రితం వ‌చ్చిన భార‌తీయుడు భారీ హిట్‌. దానికి సీక్వెల్ అంటే స‌హ‌జంగా క్రేజ్ ఉంటుంది. ఈ సీక్వెల్‌ని నిర్మించేందుకు దిల్ రాజు ముందుకు రావ‌డంతో భార‌తీయుడు 2 ప్రాజెక్ట్‌లో క‌ద‌లిక వ‌చ్చింది. ఐతే క‌మ‌ల్ హాస‌న్ త‌న పారితోషికం త‌గ్గించుకోన‌ని చెప్ప‌డం, శంక‌ర్ చెప్పిన భారీ బ‌డ్జెట్‌తో లెక్క‌లు భేరీజు వేసుకున్న దిల్ రాజు వెంట‌నే డ్రాప్ అయ్యాడు. 

క‌మ‌ల్‌తో ఇంత పెద్ద సినిమా తీయ‌డం ఏ నిర్మాత‌కైనా ఇపుడు పెద్ద రిస్క్‌. అందుకే అద‌న‌పు ఆక‌ర్ష‌ణలు కావాలి. జ‌నాల‌ని పుల్‌ చేసే హీరోయిన్‌..న‌య‌న‌తార‌. అలా శంక‌ర్ ఆమెని ఒప్పించాడ‌ట‌. ఇక క‌మ‌ల్‌హాస‌న్ రాజ‌కీయాల్లోకి వ‌స్తే త‌మ‌కి ఉప‌యోగం అనే ఉద్దేశంలో ఈ భారీ సినిమాని నిర్మించేందుకు లైకా సంస్థ ఒప్పుకొంది.