నయనతారని బుక్ చేసిన భామ

Nayanthara caught in the crossfire!
Thursday, July 23, 2020 - 12:45

హీరో-విలన్ కొట్టుకొని మధ్యలో కమెడియన్ ను చంపేశారనేది సినిమా సామెత. ఇప్పుడు నయనతార విషయంలో అదే జరుగుతోంది. సంబంధం లేని వివాదంలో ఊహించని విధంగా తన పేరు బయటకు రావడంతో ఇప్పుడీ ముద్దుగుమ్మ ఉక్కిరిబిక్కిరవుతోంది.

తమిళనాట వనిత విజయ్ కుమార్ మూడో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. పీటర్ పాల్ అనే వ్యక్తిని పెళ్లాడిందామె. అయితే పెళ్లి టైమ్ కు పీటర్, తన భార్యకు విడాకులివ్వలేదు. దీంతో ఈ పెళ్లి కాస్తా వివాదాస్పదంగా మారింది.

కోలీవుడ్ కు చెందిన చాలామంది వనితను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించసాగారు. దీంతో సహనం కోల్పోయిన వనిత, నయనతార-ప్రభుదేవా వ్యవహారాన్ని ఫ్రెష్ గా తెరపైకి తెచ్చింది. నయన్ తో డేటింగ్ చేసినప్పుడు ప్రభుదేవాకు కూడా భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారని.. విడాకులు ఇవ్వకుండానే నయన్ ను ప్రభుదేవా పెళ్లాడ్డానికి సిద్ధపడ్డాడని కొత్త వాదన తెరపైకి తెచ్చింది.

తన ప్రమేయం లేకపోయినా, సంబంధం లేకపోయినా ఇలా తన వ్యవహారం బయటకు రావడంతో నయనతార ఇబ్బంది పడుతోంది. మరోవైపు నయన్ ఫ్యాన్స్ మాత్రం సోషల్ మీడియాలో వనితను ఓ రేంజ్ లో ఆడేసుకుంటున్నారు.