కొత్త టైటిల్స్ వచ్చాయోచ్

New titles registered at film chamber of commerce
Wednesday, June 7, 2017 - 15:45

పవన్ కల్యాణ్-త్రివిక్రమ్ సినిమాకు ఏ టైటిల్ పెడుతున్నారో తెలీదు. బాలయ్య-పూరి సినిమాకు కూడా ఇంకా టైటిల్ ఫిక్స్ చేయలేదు. ఇలా కొన్ని బడా సినిమాల టైటిల్స్ పెండింగ్ లో ఉండనే ఉన్నాయి. ఇంతలోనే ఫిలింఛాంబర్ లో మరికొన్ని ఇంట్రెస్టింగ్ టైటిల్స్ రిజిస్టర్ అయ్యాయి.

భారీ బడ్జెట్ తో రామాయణంపై సినిమాను నిర్మిస్తామంటూ గీతా ఆర్ట్స్ సంస్థ ఇప్పటికే ప్రకటించింది. మరో 2 ప్రొడక్షన్ కంపెనీలతో కలిసి ఈ భారీ బడ్జెట్ సినిమాను తెరకెక్కిస్తామని ప్రకటించింది. ఇప్పుడా సినిమాకు టైటిల్ కూడా ఫిక్స్ చేసింది. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై సంపూర్ణ రామాయణం అనే టైటిల్ ఫిలింఛాంబర్ లో రిజిస్టర్ అయింది.

ఈగ, లెజెండ్ లాంటి సూపర్ హిట్ చిత్రాల్ని నిర్మించిన వారాహి సంస్థ మరో రెండు ఇంట్రెస్టింగ్ టైటిల్స్‌ని రిజిస్టర్ చేయించింది. ఒక‌టి సహోదర. మ‌రోటి త‌మ్ముడు. ఈ సంస్థ ప‌లు చిన్న చిత్రాలు తీస్తోంది. ఈ రెండు టైటిల్స్‌లో ఒక టైటిల్‌ని ఏ హీరోకు ఫిక్స్ చేయబోతున్నారనేది ప్రస్తుతానికి సస్పెన్స్. ఇక ప్రేమమ్ లాంటి సినిమాను నిర్మించిన సితార ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ సీతారామ కల్యాణం అనే మరో ఇంట్రెస్టింగ్ టైటిల్ ను రిజిస్టర్ చేయించింది.

బాహుబలి 2లో సూపర్ హిట్ అయిన సాంగ్ కూడా టైటిల్ గా మారిపోయింది. ఓ కొత్త ప్రొడక్షన్ కంపెనీ భళి భళి భళి రా భళి అనే టైటిల్ ను రిజిస్టర్ చేయించింది. ఇక శ్రీ లక్ష్మీ ప్రసన్న మూవీస్ బ్యానర్ పై గరుడు అనే టైటిల్, లక్ష్మీనరసింహా ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై శివ సన్నాఫ్ సీతాలక్ష్మి టైటిల్స్ రిజిస్టర్ అయ్యాయి.

కొత్తగా రిజిస్టర్ అయిన టైటిల్స్ లో శ్రీనివాస కల్యాణం అనే టైటిల్ కూడా ఉంది. శ్రీ వెడ్స్ నివాస్ అనేది దీనికి ట్యాగ్ లైన్. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మతగా, సతీశ్ వేగేశ్న దర్శకత్వంలో ఈ సినిమా రాబోతోంది. గతంలో వీళ్లిద్దరి కాంబోలో శతమానంభవతి లాంటి హిట్ సినిమా వచ్చింది. మరోసారి అదే బాటలో ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కథతో రాబోతోంది శ్రీనివాస కల్యాణం.