స్టార్ హీరోయిన్లకు బాధ్యత లేదా?

Nil contributions from Star heroines
Tuesday, March 31, 2020 - 17:45

కరోనాను అరికట్టేందుకు ఇండస్ట్రీ అంతా ముందుకొచ్చింది. దాదాపు స్టార్ హీరోలంతా తమకు తోచినంత విరాళాలు ప్రకటించారు. కొందరు ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రుల సహాయ నిధులకు విరాళాలు అందిస్తే, మరికొందరు పనిలేక ఇబ్బంది పడుతున్న సినీకార్మికుల్ని ఆదుకోవడానికి ముందుకొచ్చారు. అయితే ఈ మొత్తం ఎపిసోడ్ లో మన స్టార్ హీరోయిన్లు మిస్సయ్యారు.

సినిమాకు కోటి రూపాయలకు పైగా తీసుకునే కాజల్, తెలుగులో ఓ రేంజ్ లో వెలిగిపోతున్న అనుష్క, స్టార్ హీరోయిన్ స్టేటస్ ను ఎంజాయ్ చేస్తున్న సమంత.. వీళ్లెవ్వరూ ఇప్పటివరకు ముందుకురాలేదు. వీళ్లే కాదు.. ప్రస్తుతం క్రేజీ హీరోయిన్లు అనిపించుకుంటున్న రష్మిక, పూజాహెగ్డే కూడా ఇప్పటివరకు కరోనాపై స్పందించలేదు. రాశిఖన్నా, రకుల్, శ్రియ, మెహ్రీన్.. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ లిస్ట్ చాలా పెద్దది.

ఉన్నంతలో ప్రణీత, లావణ్య చాలా బెటర్. ఇద్దరూ లక్ష రూపాయలు ప్రకటించారు అటు ఐశ్వర్య రాజేష్ కూడా తనవంతుగా తమిళనాడు ప్రభుత్వానికి లక్ష రూపాయలు విరాళంగా ప్రకటించింది.

కనీసం వీళ్లను చూసైనా మన క్రేజీ హీరోయిన్లు ఒక అడుగు ముందుకేస్తే బాగుంటుందేమో. చేతులు శుభ్రంగా కడుక్కోండి, ఇంట్లోనే ఉండండి అంటూ వీడియోలు పెట్టి చేతులు దులుపుకుంటున్న ఈ తారలు, తమ వంతుగా ఆర్థిక సహాయం కూడా అందిస్తే టాలీవుడ్ తో పాటు తెలుగు ప్రేక్షకుల రుణం కాస్త తీర్చుకున్నట్టు అవుతుంది కదా.