నేను ఇక పెళ్లి చేసుకుంటా మ‌మ్మీ!

Nithin says he's ready to get married
Sunday, July 22, 2018 - 22:30

ప్ర‌భాస్‌, నితిన్‌, శ‌ర్వానంద్‌... టాలీవుడ్‌లో పెళ్లి కాని ప్ర‌సాద్‌ల జాబితా చాలా పెద్ద‌ది. ప్ర‌భాస్ ఎపుడు పెళ్లి చేసుకుంటాడ‌నే విష‌యాన్ని దేశ‌మంతా చ‌ర్చించుకుంటుంది. ఈ జాబితాలో ఉన్న బ్యాచిల‌ర్ నితిన్ ఇపుడు పెళ్లి చేసుకుంటానంటున్నాడు. 35 ఏళ్ల‌కి వ‌చ్చిన నితిన్‌కిపుడు పెళ్లి మూడ్ వ‌చ్చింద‌ట‌.

ఈ విష‌యాన్ని నితిన్ స్వ‌యంగా చెప్పాడు. దిల్‌రాజు నిర్మించిన శ్రీనివాస క‌ల్యాణం సినిమాలో నితిన్ పెళ్లి కొడుకుగా న‌టించాడు. ఈ మూవీ ఆడియో ఫంక్ష‌న్లో మాట్లాడిన నితిన్‌..ఇక తాను పెళ్లికి రెడీ అని చెప్పాడు. ద‌ర్శ‌కుడు స‌తీష్ వేగేశ్న వ‌చ్చి క‌థ చెప్పిన‌పుడే నాకు పెళ్లి మీద మ‌నసు క‌లిగింది. ఇక సినిమా మొత్తం పూర్త‌యిన త‌ర్వాత .. మ‌మ్మీ నేను ఇక పెళ్లి చేసుకుంటాన‌ని మా అమ్మ‌కి చెప్పాను అన్నాడు నితిన్‌.

టాలీవుడ్‌లో లవ్ ఎఫైర్ల గుస‌గుస‌లు త‌క్కువ వినిపించిన హీరోల్లో నితిన్ ఒక‌రు. అ ఆ సినిమా షూటింగ్ టైమ్‌లోనే పెళ్లి చేసుకుంటాన‌ని మీడియాకి చెప్పాడు. నితిన్ తాజా మాట‌ల ప్రకారం పెద్ద‌లు కుదిర్చిన సంబంధానికే ఓటేసేలా ఉన్నాడు.