నాలుగో సినిమా కోసం హీరో ప్రయత్నం

Nithin trying for fourth film
Monday, February 17, 2020 - 13:45

మహేష్, రామ్ చరణ్, ప్రభాస్ లాంటి హీరోలు ఏడాదికి ఒక సినిమా చేయడమే ఎక్కువ. నాని, సాయితేజ్ లాంటి హీరోలు ఏడాదికి రెండేసి సినిమాలు చేస్తున్నారు. నాగశౌర్య ఈ ఏడాది 3 సినిమాలు ప్లాన్ చేశాడు. అయితే నితిన్ మాత్రం వీళ్లందరికంటే ముందున్నాడు. ఇప్పటికే 3 సినిమాలు రెడీ చేస్తున్న నితిన్, కుదిరితే ఇదే ఏడాది నాలుగో సినిమా కూడా ప్లాన్ చేస్తున్నాడు

నితిన్ నటించిన భీష్మ సినిమా ఈ వీకెండ్ రాబోతోంది. రంగ్ దే సినిమాను జులైలో రిలీజ్ చేయబోతున్నారు. ఆ వెంటనే 2 నెలల గ్యాల్ లో, అంటే సెప్టెంబర్ లో చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో చేస్తున్న జైల్ అనే సినిమా కూడా వస్తోంది. ఇలా ఈ ఏడాదికి 3 సినిమాలు రెడీగా ఉన్నాయి. అయితే వీటితో పాటు నాలుగో సినిమా కూడా డిసెంబర్ నాటికి తీసుకొచ్చే ప్లాన్ లో ఉన్నాడు నితిన్.

"నాకేం కష్టం అనిపించలేదు. ప్లానింగ్ ఉంటే ఏడాదికి 3 సినిమాలు రిలీజ్ చేయడం చాలా ఈజీ. అయినా మీరు 3 సినిమాల గురించి మాట్లాడుతున్నారు. నేను నాలుగో సినిమా కూడా రిలీజ్ చేయొచ్చేమో అని ఆలోచిస్తున్నాను."

ఇలా తన మనసులో మాటను బయటపెట్టాడు నితిన్. ఏప్రిల్ 16న నితిన్ పెళ్లి చేసుకుంటున్నాడు. ఆ తర్వాత ఇండస్ట్రీకి పెద్ద పార్టీ కూడా ఇవ్వబోతున్నాడు. ఎవరైనా పెళ్లి చేసుకున్న తర్వాత హనీమూన్ ప్లాన్ చేసుకుంటారు. కానీ నితిన్ మాత్రం పెళ్లి తర్వాత మరో సినిమా ప్లాన్ చేసేలా ఉన్నాడు. నితిన్ దూకుడుతో షాలినీకి ఎడబాటు తప్పదేమో.