నితిన్ ఆశలకు కరోనా గండి

Nithin's plans went haywire due to corona outbreak
Monday, June 22, 2020 - 10:15

ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 4 సినిమాలు రిలీజ్ చేయాలని ప్లాన్ చేసుకున్నాడు. వాటి కోసం ఎంతో కష్టపడ్డాడు. అతి కష్టమ్మీద కాల్షీట్లు కూడా రెడీ చేసుకున్నాడు. ఇక్కడ అతికష్టం అని ఎందుకన్నామంటే.. ఇదే ఏడాది ఆయన పెళ్లి కూడా పెట్టుకున్నాడు. ఓవైపు పెళ్లి పెట్టుకున్నప్పటికీ.. మరోవైపు 4 సినిమాల్ని సైమల్టేనియస్ గా పూర్తిచేయాలని అనుకున్న నితిన్ కు కరోనా బ్రేకులు వేసింది.

"భీష్మ" తర్వాత వెంటనే రిలీజ్ అవ్వాల్సిన "రంగ్ దే", లాక్ డౌన్ వల్ల ఆగిపోయింది. ఇది పూర్తయిన వెంటనే రిలీజ్ అవ్వాల్సిన చంద్రశేఖర్ ఏలేటి సినిమా కూడా ఆగిపోయింది. ఈ రెండు సినిమాల వల్ల "అంధాథున్" రీమేక్ సెట్స్ పైకి రాలేకపోయింది. ఇలా నితిన్ సినిమాలన్నీ ఆగిపోయాయి. ఇవే షూటింగ్ లు లేక ఇబ్బంది పడుతుంటే... "పవర్ పేట" అని మరో సినిమాకి హాలీవుడ్ నుంచి టెక్నీషియన్లు అంటూ ప్రచారం మొదలు పెట్టారు. ఫస్ట్ ఇవన్నీ పూర్తి ఐతే... ఆ తర్వాత "పేట"కి వెళ్లొచ్చు. 

"భీష్మ" సక్సెస్ ఊపులో మరిన్ని సినిమాలు రిలీజ్ చేయాలనుకున్న నితిన్ ను కరోనా అడ్డుకుంది.

ప్రొఫెషనల్ గానే కాదు, పర్సనల్ గా కూడా నితిన్ కు కరోనా దెబ్బ తగ్గలేదు. అట్టహాసంగా అందరి సమక్షంలో గ్రాండ్ గా పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. ఎంగేజ్ మెంట్ పూర్తిచేసి, పెళ్లి పనులు కూడా మొదలుపెట్టాడు. అంతలోనే లాక్ డౌన్ పడ్డంతో పెళ్లిని కూడా వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. ఇపుడు కొత్త ముహుర్తాలు చూస్తున్నాడు. 

ఇలా నితిన్ కెరీర్ నే కాకుండా, అతడి వ్యక్తిగత జీవితాన్ని కూడా బాగా దెబ్బకొట్టింది కరోనా.