లాక్డౌన్ లో అలా మొదలెట్టింది

Nithya Menon writing scripts
Thursday, June 11, 2020 - 16:30

ఈ లాక్ డౌన్ టైమ్ లో హీరోయిన్లంతా వంట-వార్పు నేర్చుకున్నారు. కొందరు గ్లామర్ పై దృష్టిపెట్టారు. అంతా మూకుమ్మడిగా ఓటీటీకి అతుక్కుపోయారు. అయితే ఏ హీరోయిన్ చేయని పనిని చేసింది నిత్యామీనన్. "బ్యూటీ విత్ బ్రెయిన్స్"గా గుర్తింపు తెచ్చుకున్న నిత్యామీనన్.. ఈ లాక్ డౌన్ టైమ్ లో కథలు రాస్తోంది.

నిత్య మీనన్ అంటే అందరికీ ఓ హీరోయిన్ గానే తెలుసు. కానీ ఆమె రైటర్ కూడా. అప్పుడప్పుడు కవితలు, కథానికలు రాస్తుంది. ఈ లాక్ డౌన్ టైమ్ లో ఏకంగా సినిమా కథలు రాయడం ప్రారంభించానని ప్రకటించింది నిత్యామీనన్. చుట్టుపక్కలున్న వ్యక్తులు, ఘటనల్ని నిశితంగా పరిశీలిస్తున్నానని.. వాటి ఆధారంగా కొన్ని కథలు రాయడం ప్రారంభించానని తెలిపింది నిత్యామీనన్.

చూస్తుంటే.. ఈ హీరోయిన్ కాస్తా త్వరలోనే దర్శకురాలిగా మారుతుందేమో అనిపిస్తోంది. తెలుగులో "అలా మొదలైంది", "మళ్లీ మళ్లీ ఇది రాని రోజు", "ఇష్క్", "జనతా గ్యారేజ్" లాంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది నిత్యామీనన్. అలా అని టాలీవుడ్ కే పరిమితం అయిపోలేదు. మంచి పాత్ర దొరికితే భాషతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూ వస్తోంది. ఇప్పుడా అనుభవాన్ని రంగరించి తనే స్వయంగా కథలు రాయడం స్టార్ట్ చేసింది.