ఫారినొద్దు , ఇక్కడే 'సెట్' చేద్దాం!

No foreign tours, only set shoots
Tuesday, June 2, 2020 - 21:30

ఓ సాంగ్ తీయాలంటే విదేశాలకు వెళ్లిపోతారు. ఇప్పుడు కథలు కూడా విదేశీ బ్యాక్ డ్రాప్ తో అల్లేస్తున్నారు. కానీ ఇకపై "విదేశీ" అనే మాట వినిపించడానికి వీల్లేదు. కనీసం ఓ ఏడాది పాటు విదేశాలకు వెళ్లడానికి తెలుగు హీరోలు సిద్ధంగా లేరు. సరిగ్గా ఇక్కడే సెట్స్ కు డిమాండ్ పెరుగుతోంది.

ప్రభాస్ మూవీ కోసం మరోసారి విదేశాలకు వెళ్లాల్సి ఉంది. కానీ రామోజీ ఫిలింసిటీలోనే సెట్స్ వేసి మేనేజ్ చేస్తున్నారు. అటు వరుణ్ తేజ్ సినిమా కోసం విదేశాల్లో 2 సాంగ్స్ ప్లాన్ చేశారు. కానీ ఆ ప్లాన్ మార్చుకొని, సెట్స్ వేసి ఇక్కడే పూర్తిచేయాలని నిర్ణయించారు.

"రంగ్ దే", "రొమాంటిక్", "మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్" సినిమాల కోసం కూడా భారీ ఫారిన్ షెడ్యూల్స్ ప్లాన్ చేసి పెట్టుకున్నారు. చెరో సాంగ్ షూటింగ్ కోసం విదేశాలకు వెళ్లాలని "రంగ్ దే", రొమాంటిక్" చిత్రాల  యూనిట్స్ అనుకున్నాయి. కానీ సెట్స్ వేసి ఇక్కడే పని కానిచ్చేయాలని ఫిక్స్ అయ్యారు.

అటు "మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్" సినిమా కోసం మాత్రం తప్పనిసరిగా విదేశాలకు వెళ్లాల్సి ఉంది. 2 సాంగ్స్ తో పాటు కొంత టాకీ కూడా యూఎస్ బ్యాక్ డ్రాప్ లో చేయాల్సి ఉంది. కానీ అమెరికా వెళ్లకుండా ఆల్టర్నేట్ కోసం చూస్తున్నారు. ఇలా కరోనా దెబ్బతో విదేశీ షెడ్యూల్స్ అన్నీ రద్దయి, స్థానికంగా సెట్స్ కు మరింత డిమాండ్ పెరిగింది.