బాలకృష్ణ, బ్రహ్మి ఏమైపోయారు?

No response from Balakrishna and Brahmi
Tuesday, March 31, 2020 - 22:15

కరోనా విలయతాండవం చేస్తుంటే అమెరికా, యూకే లాంటి ఆగ్ర రాజ్యాలు కూడా అల్లాడిపోతున్నాయి. ఆర్థికంగా కుదేలైపోతున్నాయి. మనదేశం అందుకు మినహాయింపు కాదు. ఈ ఆర్థిక విపత్తుని గ్రహించే స్పందించే హృదయాలు ప్రధాని, ముఖ్యమంత్రుల సహాయ నిధులకు విరాళాలు ఇస్తున్నారు. చిత్ర పరిశ్రమలోని కార్మికులకు ఉపాధి  పోయింది. వారికి సాయం చేసి, తోడు ఉండేందుకు తెలుగు చిత్రసీమ ‘సి.సి.సి.’ (కరోనా క్రైసిస్ ఛారిటీస్) అని కార్యక్రమం చేపట్టింది. చిరంజీవి, నాగార్జున, దగ్గుబాటి ఫ్యామిలీ, రాంచరణ్, ఎన్టీఆర్, మహేశ్ బాబు లాంటి అగ్ర కథానాయకుల నుంచి కార్తికేయ, విశ్వక్షేన్ లాంటి వర్థమాన హీరోల వరకూ... బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్ తదితర నటులు తమ స్థాయిలో సి.సి.సి.కి విరాళాలు ఇచ్చారు. ఇందులో ఎన్టీఆర్, రాంచరణ్, ప్రభాస్, మహేశ్ లు ఇప్పటికే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధులకీ విరాళాలు ప్రకటించారు.

అందరూ స్పందిస్తుంటే కనీసం ఆ దిశగా ఒక్క మాట మాట్లాడని అగ్ర నటులూ ఉన్నారు. ఇందులో కొందరు పారితోషికం ముక్కు  పిండి వసూలు చేసుకోవడమే కాదు... తమకు షూటింగ్ లొకేషన్ నుంచి డబ్బింగ్ వరకూ చేసే డిమాండ్లు మామూలుగా ఉండవు. నందమూరి బాలకృష్ణ ఇప్పటి వరకూ అటు సర్కార్ కి గానీ, ఇటు సినిమా రంగానికిగానీ ఎలాంటి విరాళం ఇవ్వలేదు. టీడీపీ ఎమ్మెల్యేలు ఒక నెల వేతనం ప్రకటించారు. అదే తన వంతు విరాళం అని బాలకృష్ణ ఫిక్స్ అయ్యరేమో అని సినీ జనాలు చెవులు కొరుక్కొంటున్నారు. 

ఇక రెమ్యూనరేషన్ దగ్గర పక్కగా ఉంటూ... షూటింగ్ కి లేటుగా వచ్చినా డిమాండ్లలో ముందుండే ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం కూడా ఇప్పటి వరకూ స్పందించలేదు. సి.సి.సి.కి ఆయన నుంచి ఎలాంటి విరాళం వెళ్లలేదు. ఇస్తాను అనే ప్రకటన కూడా లేదు. ఇండస్ట్రితోగానీ, ఛానెల్స్ తొగానీ, టిఎస్సార్ లాంటివారితోగానీ అడపాదడపా సత్కారాలు చేయించుకొనే నైపుణ్యాలు ఉన్న బ్రహ్మీ ఎందుకు తనలోని విశాల హృహాయాన్ని ఆవిష్కరించలేదో మరి.

అగ్ర దర్శకుడు రాజమౌళిడి కూడా ఇదే బాపతా అని ఆన్లైన్ లో అప్పుడే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.