పాడుబడిన ఇంట్లో ఎన్టీఆర్ కు ఏం పని?

NTR shifts to an abandoned house
Tuesday, May 9, 2017 - 19:45

ఎన్టీఆర్ ప్రస్తుతం ఓ పాడుబడిన బంగ్లాలో ఉన్నాడు. అతడు తలుచుకుంటే ఏకంగా తన ఇంట్లోనే ఉండొచ్చు. అది కూడా వద్దనుకుంటే స్టార్ హోటల్లో బస చేయొచ్చు. కానీ ఎన్టీఆర్ హైదరాబాద్ లోని ఓ పాత బంగ్లాలో ఉండడానికి కారణం జై లవకుశ సినిమా. అవును.. హైదరాబాద్ లోని ఓ పాడుబడ్డ బంగ్లాలో జై లవకుశ షూటింగ్ జరుగుతోంది. ఈరోజు నుంచి ఈ మూవీ షెడ్యూల్ ప్రారంభమైంది.

కథ ప్రకారం.. ఎన్టీఆర్ పై ఓ పాడుబడ్డ భవంతిలో సన్నివేశాలు తీయాలి. అందుకే తారక్ ఇలా పాత భవనంలోకి షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది. తాజా సమాచారం ప్రకారం.. సినిమాకు అత్యంత కీలకమైన ఇంటర్వెల్ ఎపిసోడ్ ను ఈ బంగ్లాలో తెరకెక్కిస్తున్నారు. పైగా ఇందులో ఎన్టీఆర్ లవ కుమార్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడని టాక్.

జై లవకుశ సినిమాలో ఎన్టీఆర్ 3 క్యారెక్టర్స్ లో కనిపించబోతున్నాడనే విషయం తెలిసిందే. ఇందులో ఒక క్యారెక్టర్ పేరు జై. మరో క్యారెక్టర్ పేరు లవకుమార్. ఈ క్యారెక్టర్ కు సంబంధించి స్టిల్ కూడా బయటకొచ్చింది. ఇక ముచ్చటగా మూడో పాత్ర పేరు కుశాల్. ఈ మూడు పాత్రల్లో లవకుమార్ క్యారెక్టర్ పై ప్రస్తుతం సన్నివేశాలు తీస్తున్నారట.