గులాబో సితాబో ఎలా ఉంది?

OTT - June 12,2020 weekend attractions
Friday, June 12, 2020 - 16:30

ఈ లాక్ డౌన్ టైమ్ లో ఓటీటీలోకి మరో పెద్ద సినిమా వచ్చింది. మొన్నటికిమొన్న సౌత్ నుంచి జ్యోతిక నటించిన సినిమాను స్ట్రీమింగ్ కు పెట్టిన అమెజాన్ ప్రైమ్ సంస్థ, ఈసారి బిగ్ బి నటించిన "గులాబో సితాబో"ను ఓటీటీ ప్రేక్షకులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. థియేటర్లను కాదని, వీకెండ్ ఎట్రాక్షన్ గా రాత్రి స్ట్రీమింగ్ కు వచ్చిన ఈ సినిమాపై ప్రస్తుతం మిక్స్ డ్ రెస్పాన్స్ నడుస్తోంది. వీకెండ్ గడిచేసరికి ఎక్కువమంది ఎటు మొగ్గుచూపుతారనేది ఇంట్రెస్టింగ్ గా మారింది.

సుజీత్ సర్కార్ తెరకెక్కించిన ఈ సినిమాలో బిగ్ బితో పాటు ఆయుష్మాన్ ఖురానా నటించాడు. 2 గంటల 4 నిమిషాల నిడివి కలిగిన ఈ కామెడీ డ్రామాపై కొంతమంది క్రిటిక్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. తరణ్ ఆదర్శ్ లాంటి వాళ్లు ఏకంగా 3.5 రేటింగ్స్ ఇచ్చేశారు. మరికొంతమంది మాత్రం పెదవి విరుస్తున్నారు.

అటు సామాన్య ప్రేక్షకుల అభిప్రాయం మాత్రం ఒకేలా కనిపిస్తోంది. సినిమా చూసిన కామన్ ఆడియన్స్ అంతా "దర్శకుడు బోర్ కొట్టించాడనే" సింగిల్ లైన్ రివ్యూ పెడుతున్నారు. ఈ సినిమాకు ఇప్పుడిప్పుడే ట్రాఫిక్ పెరుగుతోంది. ఇది నిజంగా ఓటీటీలో హిట్టయిందా లేక యావరేజ్ గా నిలుస్తుందా అనే విషయం రేపటికి తేలిపోతుంది.

అటు వీకెండ్ ఎట్రాక్షన్ లో భాగంగా ఓటీటీలోకి చాలా స్టఫ్ వచ్చి చేరింది. బిగ్ బి మూవీతో పాటు "బ్రీత్-ఇన్ టు ది షాడోస్" అనే ఒరిజినల్ సిరీస్ ను కూడా ప్రవేశపెట్టింది అమెజాన్ ప్రైమ్.

అటు నెక్ట్ ఫ్లిక్స్ లో "అక్సోస్" అనే కామెడీ హిందీ డ్రామాతో పాటు తమిళ్ లో "అసురగురు"  అందుబాటులోకొచ్చింది. సన్ నెక్ట్స్ లో "అథ్యరాత్రి" అనే సినిమా స్ట్రీమింగ్ కు రాగా.. డిస్నీ హాట్ స్టార్ లో "ఆర్టెమిస్ ఫోల్" స్ట్రీమింగ్ కు వచ్చింది. మలయాళం మూవీ "కప్పెళ", జాన్వి నటించిన "గుంజన్ సక్సేనా" త్వరలోనే ఓటీటీలోకి రాబోతున్నాయి.