పాయల్ బాయ్ ఫ్రెండ్ రచ్చ

Paayal boyfriend coming to the sets
Thursday, January 9, 2020 - 13:30

వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఇది నిజం. పాయల్ కు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. పైగా సెట్స్ కొచ్చి రచ్చ రచ్చ చేస్తున్నాడట. తాజాగా ఓ సినిమా సెట్స్ లో అతగాడి వీరంగం చూసి యూనిట్ ముక్కున వేలేసుకుంది.

పాయల్  ఎక్కడున్నా అతడు ప్రత్యక్షం అవుతున్నాడు. మొన్నటివరకు ఓపెనింగ్స్, ఫంక్షన్స్ కు మాత్రమే పరిమితమైన అతడు ఇప్పుడు సరాసరి షూటింగ్ స్పాట్ కే వచ్చేస్తున్నాడట. కారవాన్ లో పాయల్ తో పాటు గంటలకు గంటలు గడిపేస్తున్నాడట. షాట్ ఓకే అని చెప్పినా పాయల్ కారవాన్ దిగడం లేదట. బాయ్ ఫ్రెండ్ తో అచ్చికబుచ్చికలు పూర్తయిన తర్వాత బండి దిగి కెమెరా ముందుకొస్తోందట. దీంతో జరగాల్సిన షూటింగ్ మరింత ఆలస్యం అవుతోందని బాధపడుతోంది యూనిట్.

హీరోయిన్ల విషయంలో యూనిట్ కు మేనేజర్లతో సమస్యలుంటాయి. లేదంటే హీరోయిన్ తల్లిదండ్రులతో సమస్యలుంటాయి. ఇలా ఫస్ట్ టైమ్ హీరోయిన్ బాయ్ ఫ్రెండ్ తో సమస్యలు ఎదుర్కొంటోంది సదరు సినిమా యూనిట్. ఇది ఇలానే కొనసాగితే పాయల్ కు అది బ్యాడ్ రిమార్క్ గా మిగిలిపోతుంది. ఎందుకంటే, పరిశ్రమలో యాక్టింగ్ కంటే ముందు ప్రవర్తన, క్రమశిక్షణ చూస్తారు. అవి లేకపోతే ఎంత టాలెంట్ ఉన్నా కెరీర్ గాల్లో దీపమే. ఈ రెండు ముక్కలు పాయల్ కు చెప్పే సాహసం మాత్రం ఎవ్వరూ చేయడం లేదు.