పవన్ కు ఆ భయం ఉంది: పరుచూరి

Parachuri Gopala Krishna praises Pawan Kalyan
Tuesday, May 26, 2020 - 18:00

హీరో, రాజకీయ నాయకుడు పవన్ కల్యాణ్ కు ఓ భయం ఉందంటున్నారు రచయిత పరుచూరి గోపాలకృష్ణ. యూత్ విషయంలో పవన్ ఎప్పుడూ భయపడుతుంటారట. ఇంతకీ ఆ భయం ఏంటో.. దానికి కారణమేంటో.. పరుచూరి మాటల్లోనే..

"పవన్ వెనక ఉన్నదంతా యూత్. అతను పిలుపిస్తే ముందు నష్టం జరిగేది యూత్ కే అనే భయం పవన్ లో ఉంది. ఎఁదుకంటే చదువుకునే పిల్లలు, ఉద్యోగాలు చేసుకునే పిల్లలు, తల్లిదండ్రులు కలలుగనే పిల్లలు.. అలాంటి వాళ్లను తన రాజకీయం కోసం పిలుపు ఇస్తే ఏమౌతుందో అనే భయం పవన్ లో ఉంది. ఈ విషయం నాకు తెలుసు. పవన్ మైక్ ముందు నిలబడి ఒక్క మాట అలా అంటే చాలు, కొన్ని లక్షల మంది రోడ్లపైకి వస్తారు. కానీ పవన్ ఆ పని చేయరు."

ఎక్కడ అన్యాయం జరిగినా రిపోర్టులు పంపమన్నారు పవన్. ఆ రిపోర్టులు తీసుకొని తను కేంద్రం దగ్గరకు వెళ్తానని, పిల్లలు మాత్రం రోడ్లపైకి రాకూడదని పవన్ కోరుకుంటున్నారు. యూత్ వీధిపోరాటాల్లోకి వస్తే మంచిది కాదని పవన్ చాలా సార్లు చెప్పిన విషయాన్ని పరుచూరి గుర్తుచేశారు.

"లీడర్ అనేవాడు క్యాడర్ ను కాపాడుకోవాలి. పవన్ కు ఎమ్మెల్యే పోస్ట్ మీద లేక ఎంపీ పోస్టు వైపు చూపు లేదు. ఒకప్పుడు భారత్ లో ఎంత మంచి రాజకీయాలు ఉండేవో అలాంటి పాలిటిక్స్ వైపు ప్రజల్ని నడిపించాలనేది పవన్ కోరిక. అందుకే 20 ఏళ్ల ప్రస్థానం అంటాడాయన."

ఇక పవన్ కొత్త సినిమా గురించి మాట్లాడుతూ.. "వకీల్ సాబ్" టైటిల్ పెట్టినోళ్లకు హ్యాట్సాఫ్ చెప్పారు పరుచూరి. తన క్యారెక్టర్ పై మాత్రమే టైటిల్ ఉండాలని పవన్ ఎప్పుడూ కోరుకోరని, "వకీల్ సాబ్" టైటిల్ మాత్రం చాలా బాగుందన్నారు.