మెగా బ్రదర్స్ మధ్య భలే సింక్

Pawan Kalyan and Chiranjeevi select similar stories
Thursday, January 30, 2020 - 10:15

పవన్ కల్యాణ్, చిరంజీవి మధ్య ఓ గమ్మత్తైన సింక్ ఏర్పడింది. సినిమాల నుంచి గ్యాప్ తీసుకొని రాజకీయాల్లోకి వెళ్లారు చిరంజీవి. ఇటు పవన్ కూడా సినిమాలకు గ్యాప్ ఇచ్చి రాజకీయాల్లోకి వెళ్లారు. ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే అసలు కథ ఇక్కడే మొదలైంది.

రాజకీయాల నుంచి దూరంగా జరిగిన చిరంజీవి తన 150వ సినిమాను రిలీజ్ చేశారు. ఆ వెంటనే 151వ సినిమాగా సైరా కూడా రిలీజ్ అయింది. ఇప్పుడు పవన్ కూడా రాజకీయాలు చేస్తూనే, సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చారు. ఒకేసారి 2 సినిమాలకు ఓకే చెప్పారు. వాటిలో ఒకటి సెట్స్ పైకి రాగా, ఇంకోటి నిన్ననే మొదలైంది.

ఇక మెగాబ్రదర్స్ మధ్య సింక్ విషయానికొస్తే.. రీఎంట్రీలో చిరంజీవి తన 150వ సినిమాకు రీమేక్ సబ్జెక్ట్ (ఖైదీ నంబర్ 150) ఎంచుకున్నారు. ఇప్పుడు పవన్ కూడా తన రీఎంట్రీ సినిమాకు రీమేక్ సబ్జెక్టే (పింక్) సెలక్ట్ చేసుకున్నాడు. ఇదే కాదు, ఇంకో పోలిక ఉంది. రీఎంట్రీ తర్వాత రెండో సినిమాకు చిరంజీవి ఓ పీరియాడిక్ మూవీ ఎంచుకున్నారు. ఇప్పుడు పవన్ కూడా అదే పనిచేశారు. రీఎంట్రీ తర్వాత తన రెండో మూవీగా క్రిష్ దర్శకత్వంలో పవన్ చేస్తున్న సినిమా కూడా పీరియాడిక్ సినిమానే.