అడ్వాన్స్ ఇచ్చిన వాళ్ళకోసమే!

Pawan Kalyan completes commitments
Sunday, February 2, 2020 - 10:45

రంగంలోకి దిగడమే ఆలస్యం, ఒక్కసారి దిగితే ఇక పనైపోయినట్టే. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇప్పుడు అదే పని మీద ఉన్నారు. సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన ఈ హీరో,  బ్యాక్ టు బ్యాక్ సినిమాలు ఎనౌన్స్ చేస్తున్నారు. తాజాగా హరీష్ శంకర్ సినిమా ప్రకటించారు. అయితే ఇవన్నీ పవన్ ఏరికోరి చేస్తున్న సినిమాలు కావు. ఆల్రెడీ ఉన్న కమిట్ మెంట్స్.

ఎన్నాళ్ల నుంచో పవన్ వద్ద మైత్రీ మూవీ మేకర్స్ అడ్వాన్స్ ఉంది. తన ఎన్నికల నామినేషన్ అఫిడవిట్ లో కూడా ఆ అడ్వాన్స్ మొత్తాన్ని చూపించారు పవన్. ఇక మైత్రీ కంటే ముందే ఏఎం రత్నంకు ఓ సినిమా చేయాల్సి ఉంది. నిజానికి కెరీర్ పీక్ లో ఉన్నప్పుడే రత్నంకు ఓ సినిమా చేయాలి. కానీ కుదర్లేదు. ఒక దశలో సినిమాను లాంఛ్ చేసి మరీ ఆపేశారు. ఈ రెండు సినిమాలు పాత కమిట్ మెంట్లు ... వీరి దగ్గర అడ్వాన్స్ తీసుకున్నారు పవన్ కళ్యాణ్. 

ఇక దిల్ రాజుకు సినిమా చేస్తాను అని గతంలో మాట ఇచ్చినా.. ఆయనతో కమిట్ మెంట్ లేదు, అడ్వాన్స్ తీసుకోలేదు. పింక్ కథ పవన్ కు బాగా నచ్చడంతో వెంటనే అది స్టార్ట్ చేశారంతే. 

ఇలా ఇంతకుముందు ఇచ్చిన మాట ప్రకారం, తీసుకున్న అడ్వాన్సుల మేరకు మాత్రం సినిమాల్ని చేస్తున్నారు పవన్. ఇందులో భాగంగా 3 సినిమాలు ప్రకటనలు వచ్చాయి. ఇక కమిట్ మెంట్స్ లేవు. కాకపోతే తన బ్యానర్ పై చరణ్ హీరోగా ఓ సినిమా చేస్తానని గతంలో ప్రకటించారు పవన్. అదే హామీ సాయితేజ్ కు కూడా ఉంది. సో.. ఈ 3 సినిమాలు పూర్తయిన తర్వాత తన సొంత బ్యానర్ పై పవన్ సినిమాలు నిర్మిస్తాడేమో చూడాలి. ఆ పని కూడా త్వరలోనే మొదలవుతుందంటున్నారు పవన్ సన్నిహితులు.