పవన్ కళ్యాణ్ అంటే... అంతే!

Pawan Kalyan keeps silent on Pink remake
Saturday, November 16, 2019 - 14:30

"పింక్" ముహూర్తం గురించి ఇంక్ అయిపోయేలా రాశారు జర్నలిస్టులు. కానీ ఇప్పుడు ఏమైంది.... పవన్ కళ్యాణ్ నుంచి నో ఉలుకు నో పలుకు. రావడం పక్కా. కానీ దానికి ముహూర్తము నిర్ణయించేది నేను... బోనీ కపూర్ కాదు, తరణ్ ఆదర్శ్ కాదు అన్నట్లు చేశారు పవన్. 

ఇప్పుడే కాదు, ఫిల్మీ కెరీర్ కొనసాగించిన రోజుల్లో కూడా పవన్ స్టయిల్ ఇదే. రకరకాల ఊహాగానాలు వినిపిస్తుంటాయి, ఎన్నో పుకార్లు వస్తుంటాయి. అందుకు ఆద్యం పోస్తూ చాలామంది దర్శకులు చాలా కథలు వినిపిస్తూ ఉంటారు. కానీ పవన్ మాత్రం మీడియా రాసిందనో, నిర్మాత ప్రకటించాడనో  గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు ఎప్పుడూ. ఒక్కసారి పచ్చ జెండా ఊపితే ఇక ఆ సినిమా కంప్లీట్ అయినట్టే.

ఇండస్ట్రీలో ఉన్నప్పుడే తన సినిమాలపై ఆచితూచి స్పందించేవారు పవర్ స్టార్. అలాంటిది ఇప్పుడు రాజకీయాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. మరీ ముఖ్యంగా ఏపీలో ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజకీయ నేతలే కాదు, ప్రజలు కూడా పవన్ వైపు చూస్తున్నారు. ఇంగ్లిష్ మీడియం, ఇసుక కొరత అంశాల్ని భుజానికెత్తుకున్న పవన్ ఆ దిశగా కార్యాచరణను అమలు చేస్తున్నారు. గవర్నర్ తో భేటీ అయ్యారు. ఢిల్లీ కూడా  వెళ్లారు.

ఇలాంటి టైమ్ లో పవన్ నుంచి పింక్ రీమేక్ ముహూర్తం ఆశించడం అత్యాశే అవుతుంది. సినిమాల్లోకి రీ-ఎంట్రీ ఉంటుంది కానీ మీడియా రాసినట్లు వెంటనే ముహూర్తం ఉండదు. ఏది జరిగినా... పవన్ నుంచి 'ఊ' అని రావాలి తప్ప... ప్రొడ్యూసర్ల ప్రకటనలతో ఏమి అవదు.