పవన్ కల్యాణ్ స్పీచ్‌పై కలకలం!

జనసేన అధినేత పవన్ కల్యాణ్ తాజాగా భీమవరంలో ఆవేశపూరితంగా చేసిన స్పీచ్ విమర్శలకి గురైంది. తెలంగాణలో ఆంధ్రవాళ్లను కొడుతున్నారన్నట్లుగా మాట్లాడడం కలకలం రేపింది. ఆయన చెప్పాలనుకున్న ఉద్దేశం వేరు కానీ అది కన్వే అయింది మాత్రం తెలంగాణలో ఆంధ్రవాళ్లను కొడుతున్నారనేది.
"మనం (ఆంధ్రా ప్రాంతం ప్రజలు) ఇక్కడ ఈ కులం, ఆ కులం అని చెప్పుకొని మనల్ని మనం విడదీసుకుంటున్నాం. మనం కులాల వారిగా విడిపోతున్నాం. కానీ తెలంగాణ వాళ్లకి మనం దళితులైనా, వైశ్యులైనా, మరో కులం వారైనా..వారందరికీ మనం ఆంధ్రావారిమే. మనల్ని అక్కడ కొడుతున్నారు." ఇలా స్పీచ్ ఇచ్చాడు.
మరో రెండు నెలలు గడిస్తే...తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఐదేళ్లు అవుతుంది. ఈ ఐదేళ్ల కాలంలో హైదరాబాద్‌లో కానీ, తెలంగాణలోని ఇతర జిల్లాల్లో కానీ ఆంధ్రావారిపై వివక్ష చూపిన సంఘటలను కానీ, హేట్ స్పీచ్ కానీ, దాడి జరిగిన సంఘటన కానీ నమోదు కాలేదు. అందరూ సామరస్యపూర్వకంగానే ఉన్నారు, ఉంటున్నారు. ఇలాంటి తరుణంలో పవన్ కల్యాణ్ భీమవరంలో గెలవడానికోసమో, స్పీచ్‌లో మసాలా దట్టించాలనే ఉద్దేశంతోనే నోరు జారారు. తెలంగాణలో ఆంధ్రావాళ్లని కొడుతున్నారని మాట్లాడడం విమర్శలకి దారితీసింది. ఆంధ్రాప్రాంతానికి చెందినవారే పవన్ కల్యాణ్ బాధ్యతారాహిత్యమైన మాటలపై మండిపడుతున్నారు.
- Log in to post comments