లాక్ డౌన్లో ఈ అల్లరేంది?

Police begin investigation in Sharmila Mandre's accident case
Monday, April 6, 2020 - 17:45

దేశమంతా లాక్ డౌన్ నడుస్తోంది. అంతా ఇళ్లకే పరిమితమైపోయారు. బండి బయటకు తీస్తే పోలీసులు లాఠీలు బయటకు తీస్తారు. ఇలాంటి టైమ్ లో ఓ హీరోయిన్ కారు బయటకు తీసింది. పోలీసుల కళ్లుగప్పి రోడ్డుపైకొచ్చింది. అక్కడితే ఆగితే ఫర్వాలేదు. ఏకంగా పెద్ద యాక్సిడెంట్ చేసింది. ఆమె పేరు షర్మిల మండ్రే. అల్లరినరేష్ సరసన "కెవ్వు కేక" అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది ఈ పిల్ల.

బెంగళూరులో ఉంటున్న ఈ ముద్దుగుమ్మ మొన్న ఉదయం 3 గంటల టైమ్ లో తన ఫ్రెండ్స్ తో కలిసి కొత్త జాగ్వార్ కారు బయటకు తీసింది. రయ్ మంటూ బెంగళూరు రోడ్లపై దూసుకెళ్లింది. ఏం జరిగిందో ఏమో కారు అదుపుతప్పి, రోడ్డు పక్కనే ఉన్న బ్రిడ్జి స్తంభానికి తగిలింది. కారు ముందుభాగం నుజ్జునుజ్జయింది. షర్మిల మండ్రే హాస్పిటల్ చేరింది.

అయితే ఆమెకు, ఆమె స్నేహితులకు స్వల్ప గాయాలయ్యాయి. తాగి, మద్యం మత్తులో ఆమె కారు నడిపి ఉంటుందంటూ ఓ సెక్షన్ మీడియా  రాసుకొచ్చింది. దీనిపై ఈరోజు షర్మిల స్పందించింది. తనకు అర్థరాత్రి కడుపు నొప్పి వచ్చిందని, వెంటనే డాన్, థామస్ అనే ఇద్దరు ఫ్రెండ్స్ కు ఫోన్ చేశానని, డాన్ కారు నడిపి యాక్సిడెంట్ చేశాడని చెప్పుకొచ్చింది. తనకు మెడకు దెబ్బలు తగిలాయని ప్రస్తుతం కోలుకున్నానని చెప్పుకొచ్చింది. అదే కారులో షర్మిల ఫ్రెండ్ వసంత్ కూడా ఉన్నట్టు సమాచారం.

అయితే పోలీసులు మాత్రం ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నారు. షర్మిల చెబుతున్న విషయాల్లో నిజాల్ని నిగ్గుతేల్చే పనిలో ఉన్నారు. సీసీటీవీ ఫూటేజ్ ను బయటకు తీశారు.