పూజాహెగ్డే బిందె.. సమంత కుర్తా

Pooja Hegde, Samantha and K Raghavendra Rao
Monday, February 10, 2020 - 22:30

సినిమా జనాలకు మైక్ అందిస్తే మనల్ని ఎక్కడికో తీసుకెళ్లిపోతారు. ఇదంతా నిజమేనా అని మనల్ని మనం గిల్లుకునేంతగా మాట్లాడేస్తుంటారు. మాటలు కోటలు దాటిపోతాయి అనే సామెత కూడా చిన్నబోతుంది వీళ్ల మాటలు వింటే. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు మాటలు కూడా ఇలానే ఉన్నాయి.

జాను సినిమా ఆఫ్టర్-రిలీజ్ ప్రమోషన్ లో భాగంగా ఓ చిన్న కార్యక్రమం ఏర్పాటుచేసిన రాఘవేంద్రరావును పిలిచారు. సినిమా ఎలా ఉందో చెప్పాలంటూ మైక్ అందించారు. ఇక చూస్కోండి దర్శకేంద్రుడి ప్రతాపం. మితభాషిగా పేరుతెచ్చుకున్న రాఘవేంద్రరావు కాస్తా ఈసారి అతిభాషి అనిపించుకున్నారంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. ఆ రేంజ్ లో జాను తాటిచెట్టు ఎక్కించారు. ఇంతా చేసి ఇది స్ట్రయిట్ మూవీ కాదు, రీమేక్ అనే విషయం అందరికీ తెలిసిందే

చివరికి రాఘవేంద్రరావు మాటలు ఏ రేంజ్ కు వెళ్లాయంటే.. సినిమాలో సమంత తన కుర్తాను శర్వానంద్ కు ఇస్తుంది. అది తనకు కావాలంటూ మారం చేయబోయారు దర్శకేంద్రుడు. కాకపోతే జాను ఇచ్చిన కుర్తా రామచంద్ర కోసమని, అది రాఘవేంద్ర కోసం కాదనే విషయం తెలుసుకొని ఆగిపోయానంటూ చమత్కరించారు.

రాఘవేంద్రరావు ఇలా అడిగి తీసుకోవడం ఇదే ఫస్ట్ టైమ్ కాదు. గతంలో గద్దలకొండ గణేష్ ఫంక్షన్ కు వచ్చినప్పుడు కూడా ఇలానే మారాం చేశారు. సినిమాలో పూజా హెగ్డే బిందె కావాలంటూ డిమాండ్ చేశారు. చివరికి పూజా హెగ్డే ముద్దుపెట్టి మరీ ఓ బిందె ఇస్తే, దాన్ని అపురూపంగా తీసుకున్నారు. అక్కడ బిందె తీసుకున్న దర్శకేంద్రుడు, ఇక్కడ కుర్తా తీసుకోవాలనుకున్నారు. అంతే తేడా.