చెత్తగా ఉందన్నారు... 200 కోట్లు ఇచ్చారు

Pooja Hegde's Housefull 4 got 200 Cr gross
Wednesday, November 13, 2019 - 14:30

ప్రజల అభిరుచికి, రివ్యూలు రాసే జనాలకు మధ్య తేడా స్పష్టంగా కనిపిస్తోంది. ఒకప్పుడు రివ్యూకు తగ్గట్టే మూవీ రిజల్ట్ ఉండేది. కానీ ఇప్పుడు స్టార్ డమ్ ఉంటే చాలు, రివ్యూస్ తో సంబంధం లేకుండా కాసుల వర్షం కురుస్తోంది. బాలీవుడ్ లో ఆమధ్య విడుదలైన సాహో సినిమా ఈ విషయాన్ని రుజువు చేస్తే, తాజాగా వచ్చిన హౌజ్ ఫుల్ 4 మూవీ దీన్ని మరోసారి కన్ ఫర్మ్ చేసింది.

అక్షయ్ కుమార్ నటించిన ఈ కామెడీ సిరీస్ పరమ చెత్తగా ఉందంటూ విమర్శకులు ఏకి పడేశారు. ఈ సినిమాను తిట్టని విమర్శకుడు లేడు. సినిమా కంటెంట్ చెత్తగా ఉందని ఓపెన్ గానే పోస్టులు పెట్టారు. కానీ వసూళ్లను ఈ కామెంట్లు ఆపలేకపోయాయి. చూస్తుండగానే హౌజ్ ఫుల్ 4 మూవీ, ఈ ఏడాది టాప్-10 బిగ్గెస్ట్ హిట్స్ జాబితాలోకి చేరిపోయింది. అలా దూసుకెళ్తున్న ఈ మూవీ తాజాగా ఒక్క ఇండియాలోనే 200 కోట్ల రూపాయల వసూళ్లు సాధించి ఔరా అనిపించింది. విడుదలైన 17వ రోజు ఈ ఘనత సాధించింది అక్షయ్ కుమార్ సినిమా.

అయితే వసూళ్లు వస్తున్నప్పటికీ రివ్యూస్ పై అక్షయ్ కుమార్ అలెర్ట్ అయ్యాడు. తన స్టార్ డమ్, మూవీ ఫ్రాంచైజీ కారణంగా మంచి వసూళ్లు వస్తున్నప్పటికీ.. భవిష్యత్తులో హౌజ్ ఫుల్ 5 సినిమా తీస్తే మాత్రం కచ్చితంగా కంటెంట్ పై మరింత దృష్టిపెడతామని భరోసా ఇచ్చాడు అక్కీ. సినిమాలో కామెడీ, కొన్ని ఎపిసోడ్లు ఆశించిన స్థాయిలో లేవని అంగీకరించిన అక్షయ్.. జరిగిపోయిన దాని గురించి బాధపడే కంటే.. ఐదో భాగంలో ఆ తప్పుల్ని సరిదిద్దుకుంటామని ఓపెన్ గా ప్రకటించాడు.