లిప్‌లాక్ లేని హీరోయిన్ నేనే!

Poojitha Ponnada talks about her movie Sevent
Sunday, June 2, 2019 - 19:15

హవీష్ హీరోగా నిజార్ షఫీ దర్శకత్వంలో కిరణ్ స్టూడియోస్ పతాకంపై రమేష్ వర్మ ప్రొడ‌క్ష‌న్‌లో రమేష్ వర్మ నిర్మించిన డిఫరెంట్ రొమాంటిక్ థ్రిల్లర్ 'సెవెన్'. 'దర్శకుడు', 'రంగస్థలం' సినిమాలతో ప్రేక్షకుల్లో గుర్తింపు తెచ్చుకున్న తెలుగమ్మాయి పూజితా పొన్నాడ ఇందులో ఒక హీరోయిన్‌గా నటించారు. జూన్ 5న సినిమా విడుదలవుతున్న సందర్భంగా పూజితా పొన్నాడతో ఇంటర్వ్యూ.... 

'సెవెన్'లో మీ పాత్ర ఏమిటి?

నాదొక సస్పెన్స్ రోల్. ఎక్కువ రివీల్ చేయకూడదు. ఆల్రెడీ విడుదలైన ట్రైలర్లు, పాటలు చూసి ఉంటారు. ఇదొక రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్. కథలో కొన్ని ప్రశ్నలకు నా పాత్ర ద్వారా సమాధానం లభిస్తుంది. స్క్రీన్ ప్లే బేస్డ్ రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ ఇది.  కాన్సెప్ట్ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. 

మీరు ఇప్పటివరకూ చేసిన క్యారెక్టర్లలో ఈ సినిమాలో క్యారెక్టర్ బోల్డ్ అనుకుంట?

బోల్డ్ కాదు.. డిఫరెంట్ క్యారెక్టర్. 'సెవెన్'లో నా క్యారెక్టర్‌కు మంచి ప్రేమకథ ఉంది. నేను నటించిన ఫస్ట్ ప్రోపర్ లవ్ స్టోరీ ఇదే అనుకుంటున్నాను.

ట్రైల‌ర్‌లో లిప్ లాక్స్‌ హాట్ టాపిక్. ఫస్ట్ టైమ్ కిస్ సీన్ చేసినట్టున్నారు?

ఈ సినిమాలో నాకు లిప్ లాక్ సీన్స్ ఉన్నాయని ఎవరు చెప్పారు? 'సెవెన్'లో లిప్ లాక్ లేని ఏకైక హీరోయిన్ నేనే అనుకుంటాను.

తెలుగు, తమిళ భాషల్లో సినిమా తీశారు. తమిళంలో నటించడం ఎలా ఉంది?

నా స్కూలింగ్, కాలేజీ ఎడ్యుకేషన్ అంతా చెన్నైలో సాగింది. అందువల్ల, నాకు తమిళం బాగా వచ్చు. దాంతో తమిళ షూటింగ్ ఇబ్బందిగా అనిపించలేదు. ఈజీగా చేశా. తమిళ చిత్ర పరిశ్రమకు పరిచయం కావాలని కొంతకాలంగా అనుకుంటున్నా. ఈ సినిమాతో యాక్సిడెంటల్‌గా పరిచయం అవుతున్నా. ముందు బైలింగ్వల్ చేస్తున్నారని నాకు తెలియదు.

ప్రస్తుతం తెలుగమ్మాయిలకు అవకాశాలు ఎలా వస్తున్నాయి?

ఎవరి ప్రయాణం వాళ్ళది. ఒక హీరోయిన్ కెరీర్‌తో మ‌రో హీరోయిన్ కెరీర్‌ని కంపేర్ చేయ‌కూడ‌దు. నా వరకూ మంచి అవకాశాలు వస్తున్నాయి. దర్శక, నిర్మాతలు తెలుగమ్మాయిలు కావాలని మరీ తీసుకుంటున్నారు. మా ఇంట్లో సినిమా నేపథ్యం ఉన్నవాళ్లు ఎవరూ లేరు. నటనపై ఆసక్తితో షార్ట్ ఫిలిమ్స్ చేశా. ఇంట్లో అవి చూపిస్తే ఎంకరేజ్ చేశారు. సుకుమార్ గారు నేను నటించిన షార్ట్ ఫిలిమ్స్ చూసి 'దర్శకుడు'కి ఎంపిక చేశారు. ఆ సినిమా కాస్టింగ్ పర్సన్ కి నా పాత్రకు తెలుగమ్మాయే కావాలని సుకుమార్ గారు చెప్పారట. అదొక్కటే కాదు... ఇప్పటివరకూ నేను నటించిన ప్రతి పాత్ర తెలుగమ్మాయి కావడం వల్ల వచ్చినదే. 

మీ తదుపరి సినిమాలు?

రాజశేఖర్ గారి 'కల్కి' విడుదలకు సిద్ధమైంది. అందులో నా క్యారెక్టర్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. నేను గిరిజన యువతిగా నటిస్తున్నాను. నా లుక్ నుంచి ప్రతి విషయంలో దర్శకుడు ప్రశాంత్ వర్మ గారు డిటైల్డ్ గా వర్క్ చేసి, క్యారెక్టర్ డిజైన్ చేశారు. నా రోల్ కి మంచి ట్విస్ట్ కూడా ఉంటుంది. కథ విన్నప్పుడు చాలా ఎగ్జైట్ అయ్యాను. 'కల్కి' కాకుండా కీర్తీ సురేష్ గారితో ఒక తెలుగు సినిమాలో నటిస్తున్నా. తమిళంలో ఒక సినిమాకు సంతకం చేశా.