ఇక క‌త్తి దించ‌నున్న పూనమ్‌

Poonam Kaur's small screen debut: Swarna Khadgam
Thursday, July 19, 2018 - 15:15

పూన‌మ్ కౌర్ న‌టించిన భారీ హిట్ చిత్రం ఏదీ? అలా అడిగితే వెంట‌నే గుర్తు రావ‌డం క‌ష్టం. ఆమె హీరోయిన్‌గా న‌టించిన సినిమాలు పెద్ద‌గా బ్లాక్‌బ‌స్ట‌ర్స్ కాలేదు కానీ ఆమె ట్వీట్లు మాత్రం సూప‌ర్‌డూప‌ర్ హిట్‌. ఆమెని రీసెంట్‌గా వార్త‌ల్లో ఉంచిన‌వి ఆమె వేసిన ట్వీట్లే. ఆమె ఎవ‌ర్ని ఉద్దేశించి ఆ ట్వీట్లు వేసిందో తెలియ‌దు కానీ క‌త్తి మ‌హేష్ చేసిన ఆరోప‌ణ‌ల కార‌ణంగా పూన‌మ్ కౌర్ ట్వీట్ల‌ను అంద‌రూ ఫాలో అవ‌డం మొద‌లుపెట్టారు.

మొత్తానికి ఇపుడు అది ముగిసిన అధ్యాయంలానే క‌నిపిస్తోంది. పూన‌మ్ కూడా సోష‌ల్ మీడియాలో హంగామా చేయ‌డం మానేసి బుల్లితెర‌పై సంద‌డి చేయ‌నుంది. ఆమె న‌టించిన భారీ టీవీ సీరియ‌ల్‌..స్వ‌ర్ణ ఖ‌డ్గం.

ఆమె తాజాగా త‌న సీరియ‌ల్‌ని చూసి విజ‌యవంతం చేయ‌మ‌ని ఫేస్‌బుక్ ద్వారా అభిమానుల‌ను కోరుతోంది. ఇది ఆమె ఫేస్‌బుక్ పోస్ట్: అందరికి నా నమస్కారం...!! నేను మీ పూనమ్ కౌర్ !! ఈ వారం నుంచి ప్రతి శుక్ర‌వారం  ఇంకా శనివారం రాత్రి 8:౩౦ లకి మీ ఈటివిలో స్వర్ణఖడ్గం చూడండి..నన్ను ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను..... నేను మీ #పూనమ్కౌర్ #స్వర్ణఖడ్గం

ఇక ఆమె బుల్లితెర‌పై క‌త్తి దించుతుంద‌న్న‌మాట‌. ఈ సీరియ‌ల్‌ని బాహుబ‌లి నిర్మాత‌ల‌కి సంబంధించిన ప్రొడ‌క్ష‌న్ కంపెనీ భారీ ఎత్తున రూపొందించింది. పూన‌మ్ కౌర్‌పై ఇంత పెద్ద సీరియ‌ల్ నిర్మించ‌డం విశేష‌మే.