కరోనా... ఐనా ప్రచారం ఆపట్లేదు

Pradeep is not stopping publicity and promotion
Friday, March 20, 2020 - 16:45

సాధారణంగా సినిమా రిలీజ్ వాయిదా పడినప్పుడు ఆటోమేటిగ్గా ప్రచారాన్ని కూడా వాయిదా వేస్తారు. కొత్త రిలీజ్ డేట్ ప్రకటించిన తర్వాత మళ్లీ ఫ్రెష్ గా ప్రమోషన్ స్టార్ట్ చేస్తారు. కానీ యాంకర్ కమ్ హీరో ప్రదీప్ మాత్రం ఆగడం లేదు. అసాధారణ పరిస్థితుల మధ్య, థియేటర్లన్నీ మూతపడిన నేపథ్యంలో.. తన సినిమా నిరవధికంగా వాయిదాపడినప్పటికీ.. ప్రదీప్ మాత్రం ప్రచారాన్ని వాయిదా వేయలేదు.

ఇప్పటికే అలీతో జాలీగా, క్యాష్ లాంటి టాప్ రేటెడ్ కార్యక్రమాల్లో కనిపించిన ప్రదీప్.. తనకు తెలిసిన, తనను సంప్రదించిన యూట్యూబ్ ఛానెళ్లన్నింటికీ ఇంటర్వ్యూలు ఇస్తూనే ఉన్నాడు. "30 రోజుల్లో ప్రేమించడం ఎలా" సినిమా చాలా బాగుందని చెబుతూనే ఉన్నాడు.

లెక్కప్రకారం.. ఈనెల 25న థియేటర్లలోకి రావాలి ప్రదీప్ సినిమా. అటు నాని-సుధీర్ బాబు కలిసి చేసిన "V" అనే సినిమా కూడా అదే తేదీకి రావాలి. వాళ్లు మాత్రం ప్రచారాన్ని ఆపేశారు. కొత్త రిలీజ్ డేట్ వచ్చిన తర్వాత బరిలోకి దిగుతారు. ప్రదీప్ మాత్రం ప్రమోషన్ ఆపడం లేదు. ఓవైపు యాంకరింగ్ చేస్తూనే.. మిగతా టైమ్ లో యూట్యూబ్ ఛానెల్స్ అన్నీ కవర్ చేస్తున్నాడు.