సీన్ ఉన్నోడికే రేట్ ఎక్కువ

Prakash Raj talks about remuneration
Thursday, July 30, 2020 - 15:00

కరోనా వల్ల హీరోల రెమ్యూనరేషన్స్ తగ్గిపోతాయా?

ప్రస్తుతం ఇండస్ట్రీలో జోరుగా నడుస్తున్న టాపిక్ ఇది. దీనిపై ప్రకాష్ రాజ్ తనదైన శైలిలో స్పందించాడు. కరోనా ఉన్నా లేకున్నా, మార్కెట్ కు అనుగుణంగానే హీరోల పారితోషికాలుంటాయంటున్నాడు ప్రకాష్ రాజ్. అయితే కరోనా పరిస్థితులకు తగ్గట్టు బడ్జెట్ విషయంలో ఎడ్జెస్ట్ అవ్వాల్సిందేనని.. అందరూ కలిసి చేయూతనిస్తేనే ఇండస్ట్రీ లేస్తుందని చెబుతున్నాడు.

"రెమ్యూనరేషన్ లో ఎక్కువ తక్కువ అని చెప్పలేం. మార్కెట్ కు తగ్గట్టు రెమ్యూనరేషన్ తీసుకుంటారు. కరోనా వల్ల మార్కెట్ తగ్గిందనుకుంటే దానికి తగ్గట్టే తీసుకుంటారు. అనవసరంగా నిర్మాతలు ఎవ్వరికీ ఎక్కువ రెమ్యూనరేషన్ ఇవ్వరు కదా. ఫలానా హీరోకు కోట్ల రూపాయలు ఇస్తున్నారంటే దానర్థం అతడికి మార్కెట్ ఉందనే కదా. అలా మార్కెట్ లేదన్నప్పుడు నిర్మాత అన్ని కోట్లు ఎందుకిస్తాడు. నష్టానికి ఏ నిర్మాత సినిమా చేయడు కదా. ఏ నటుడికైనా వివరంగా చెబితే అర్థంచేసుకుంటాడు. ఎవరూ మూర్ఖులు కాదు కదా."

టాలీవుడ్ లో హీరోలందరికీ నిర్మాతలతో సత్సంబంధాలున్నాయంటున్నాడు ప్రకాష్ రాజ్. అవసరమైతే రెమ్యూనరేషన్ తగ్గించుకోవడానికి ప్రతి ఒక్కరూ ముందుకొస్తారని అంటున్నాడు.

"పరిశ్రమలో చాలామంది మంచి హీరోలున్నారు. చిరంజీవి, మహేష్, తారక్, బన్నీ, ప్రభాస్.. వీళ్లంతా మంచి మనుషులు. ప్రొడ్యూసర్లతో మంచి సంబంధాలు ఉన్న హీరోలు. కరోనా వల్ల ఇండస్ట్రీలో మార్కెట్ తగ్గిందనుకుంటే వీళ్లు కూడా తమ జీతాలు తగ్గించుకుంటారు. ఇండస్ట్రీకి చెందిన వ్యక్తిగా, నాకు వీళ్లందరూ తెలుసు కాబట్టి చెబుతున్నాను. అందరూ చాలా మంచి వాళ్లు. పరిశ్రమకు నష్టం తీసుకొచ్చే పని చేయరు."

ఓటీటీ వల్ల థియేటర్లకు ఎలాంటి నష్టం ఉండదంటున్నాడు ప్రకాష్ రాజ్. ఓటీటీని తట్టుకునేందుకు థియేటర్ మార్కెట్ ఓ కొత్త టర్న్ తీసుకుంటుంది తప్ప, వ్యవస్థ నిర్వీర్యం అవ్వదంటున్నాడు.