మొన్న మహేష్.. నేడు మల్లేశం

Priyadarshi and Zee connection
Thursday, June 11, 2020 - 14:00

వాడకం విషయంలో జీ తెలుగు తర్వాతే ఎవరైనా. మొన్నటికిమొన్న మహేష్ బాబు లాంటి పెద్ద స్టార్ ను తమ సీరియల్స్ ప్రచారానికి వాడుకుంది ఈ ఛానెల్. అతడికి ఎంతిచ్చారనే విషయాన్ని పక్కనపెడితే.. ఓ సాధారణ తెలుగు సీరియల్ కు మహేష్ బాబు ప్రచారం చేయడమేంటంటూ అభిమానులు చెవులుకొరుక్కున్నారు. అయితే ఆ ఎపిసోడ్ లో తెరవెనక ఏం జరిగిందనేది చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు.

ఇప్పుడు అలాంటిదే మరో ఎపిసోడ్ కు తెరదీసింది జీ తెలుగు. ఈసారి ప్రియదర్శిని వాడకానికి సిద్ధం చేసింది. ఆమధ్య జీ5 యాప్ లో "లూజర్" అనే ఒరిజినల్ కంటెంట్ పడింది. అందులో మనోడే హీరో. అక్కడితో ప్రియదర్శిని వదల్లేదు జీ తెలుగు. తమ సీరియల్స్ కోసం కూడా అతడ్ని వాడేసింది.

లాక్ డౌన్ తో సీరియల్స్ అన్నీ ఆగిపోయాయి. తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో త్వరలోనే ఆగిపోయిన సీరియల్స్ అన్నీ మళ్లీ ప్రారంభం కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో.. తమ సీరియల్స్ మళ్లీ వస్తున్నాయంటూ చెప్పడం కోసం ప్రియదర్శితో ప్రోమో సిద్ధంచేసింది జీ తెలుగు. త్వరలోనే సీరియల్స్ అన్నీ పునఃప్రారంభం కాబోతున్నాయని, ప్రేక్షకులు సిద్ధంగా ఉండండంటూ సినీనటుడు ప్రియదర్శి చెబుతుంటే అవాక్కవ్వడం జనం వంతయింది. ఇంకా ఎంతమందిని ఈ ఛానెల్ ఇలా వాడుతుందో చూడాలి.