పూరి జగన్నాధ్ మంచి పని

Puri Jagannadh's good deed
Friday, September 27, 2019 - 15:45

ఇస్మార్ట్‌ శంకర్‌ సినిమాతో పూరి జగన్నాథ్‌ జీవితం మారిపోయింది. ఈ సినిమా విడుదలకి ముందు పూరి చాలా డిప్రెషన్‌లో ఉన్నారు. అప్పులు, ఫ్లాప్‌లు ఆయన్ని బాగా కుంగదీశాయి. దానికి తోడు కొడుకుతో తీసిన మెహబూబా పరాజయం పాలు కావడం, అంతకుముందు డ్రగ్స్‌ కేసు చుట్టుకోవడం.. ఇవన్నీ ఆయన మోరల్‌గా వీక్‌ చేశాయి. ఐతే రామ్‌ హీరోగా తీసిన ఇస్మార్ట్‌ శంకర్‌ ఘన విజయం ఆయన ఔట్‌లుక్‌ని మార్చేసింది. సినిమాతో అప్పులన్నీ తీరిపోయాయి. మళ్లీ తన ఆఫీస్‌ కళకళలాడడం మొదలుపెట్టింది. 

అలాగే జీవితాన్ని, సినిమా రంగాన్ని చూసే దృక్కోణం మారింది. ఇపుడు పాజిటివ్‌ లుక్‌ వచ్చింది. పనిలోపనిగా చారిటీ చేయాలనే సంకల్పం కలిగింది. ఇస్మార్ట్‌ శంకర్‌ వల్ల వచ్చిన లాభాల తర్వాత పూరి, చార్మి కలిసి ఒక మంచి పని చేయబోతున్నారు. రేపు ఆయన పుట్టిన రోజు (సెప్టెంబర్‌ 28). ఈ బర్త్‌డే నాడు ఆయన చార్మితో కలిసి 20 మంది దర్శకులకి, కోడైరక్టర్స్‌కి ఆర్థిక సహాయం చేయనున్నారు. 

"దర్శకత్వ శాఖలోని మనవాళ్లు కొందరు పనిలేకనో, సినిమాలు చేసే అవకాశం రాకనో ఖాళీగా ఉండి ఇబ్బందులు పడటం చూసి మా మనసుకు కష్టం అనిపించింది. అందరూ బాగుండాలని కళ్లు మూసుకుని దేవుడిని ప్రార్థించడం కన్నా, కొందరికి ఎంతో కొంత ఆర్థికంగా సహాయం చేయాలనిపించింది. ఒకప్పుడు సినిమాలు చేసి ప్రస్తుతం పని లేకుండా ఖాళీగా ఉండి తమ జీవితాలను సినిమాకి అంకితం చేసి, కష్టపడి పనిచేసిన డైరెక్టర్స్, కో-డైరెక్టర్స్ 20 మందికి మా వంతు ఆర్థిక సహాయం చేయాలనుకుంటున్నాము. ప్రేమతో అంగీకరించండి. ఇదేమి పెద్ద సహాయం కాదు, చిన్న చిరునవ్వులాంటి పలకరింపు అంతే..!

మా ఈ చిన్న సహాయం.. మీకు ఏమాత్రం ఊరటనిచ్చినా చాలు. అది మా ప్రయాణానికి ఆశీస్సులుగా భావిస్తాము. మేము తలపెట్టే ఇలాంటి ఓ మంచి కార్యక్రమానికి మీ అందరిని ఆహ్వానిస్తున్నాము.

మేము బతికి ఉన్నంతకాలం ఇదేవిధంగా దేవుడు శక్తిని ఇచ్చినట్లయితే..మేము ప్రతి సంవత్సరం ఇలాగే సహాయం చేయాలని అనుకుంటున్నాం."

రేపు ప్రసాద్‌ ల్యాబ్‌లో వారికి చెక్‌లు అందచేస్తారట. వెరీ గుడ్‌ గెస్చర్‌ పూరి. సూపర్‌!