రాశిఖన్నాకు గట్టి షాక్!

Raashi Khanna is not getting offers opposite big stars
Monday, March 23, 2020 - 19:45

హీరోలు తమ కెరీర్ ను స్లోగా స్టార్ట్ చేయొచ్చు. మెల్లగా సినిమాలు చేసుకుంటూ ఏదో ఒక ఇమేజ్ కు ఫిక్స్ అవ్వొచ్చు. హీరోయిన్ల కెరీర్ అలా ఉండదు. తారాజువ్వలా రయ్ మని దూసుకొచ్చామా.. స్టార్స్ సరసన ఎడాపెడా నటించామా.. అంతే స్పీడ్ తో కెరీర్ చాలించామా అన్నట్టుంటుంది వీళ్ల వ్యవహారం. సరిగ్గా ఇక్కడే రాశిఖన్నా తప్పటడుగులు వేసింది. ఆమె పాటించిన స్లో అండ్ స్టడీ ఫార్ములా వర్కవుట్ కాలేదు.

ఆశ్చర్యంగా అనిపించినా రాశిఖన్నా ఫీల్డ్ లోకి వచ్చి ఆరేళ్లైంది. అప్పుడెప్పుడో వచ్చిన "ఊహలు గుసగుసలాడే" సినిమాతో ఆమె హీరోయిన్ గా మారింది. అయితే అప్పట్నుంచి ఆమె రామ్, రవితేజ, సాయితేజ్, గోపీచంద్, వరుణ్ తేజ్ లాంటి హీరోల పైనే దృష్టిపెట్టింది తప్ప.. మహేష్ బాబు, రామ్ చరణ్, అల్లు అర్జున్, ప్రభాస్ లాంటి హీరోల మీద దృష్టి పెట్టలేదు. మెల్లగా ఒక్కోమెట్టు ఎక్కాలనుకుంది. 

సరిగ్గా ఇక్కడే ప్లాన్ బెడిసికొట్టింది. చిచ్చరపిడుగుల్లా దూసుకొచ్చారు రష్మిక, పూజా హెగ్డే. రష్మిక ఇండస్ట్రీకొచ్చి జస్ట్ రెండేళ్లే అయింది. అటు పూజా హెగ్డే టాలీవుడ్ లో రీఎంట్రీ ఇచ్చి మూడేళ్లు మాత్రమే అయింది. కానీ వస్తూనే వీళ్లు పెద్ద హీరోల కళ్లలో పడ్డారు. రష్మిక అయితే ఏకంగా మహేష్ తో సినిమా చేసేసింది. ఇప్పుడు బన్నీతో సినిమాకు రెడీ అవుతోంది. రేపోమాపో ప్రభాస్ తో సినిమా అనే టాక్ కూడా నడుస్తోంది.

ఇటు పూజా హెగ్డే సంగతి చెప్పనక్కర్లేదు. స్టార్ హీరోలంతా ఈమె  వెంట పడుతున్నారు. బన్నీ, మహేష్, తారక్, రామ్ చరణ్  ను కవర్ చేసిన ఈ బ్యూటీ.. ప్రస్తుతం ప్రభాస్ తో సినిమా చేస్తోంది.

ఇలా రష్మిక, పూజా హెగ్డే రాకతో రాశిఖన్నాకు గట్టి షాక్ తగిలింది. మెల్లగా సినిమాలు చేసుకుంటూ మహేష్ బాబు తో నటించే రేంజ్ కు ఎదుగుదామనుకున్న ఈ బ్యూటీకి ఇప్పుడు స్టార్ హీరోలు దాదాపు ముఖం చాటేసే పరిస్థితి వచ్చేసింది.