రాశిఖన్నా ఇరుక్కుంది

Raashi Khanna in a spot
Monday, December 9, 2019 - 09:15

ఒక సినిమా 13న రిలీజ్.. మరో సినిమా 20న రిలీజ్.. వరుసగా రెండు వారాలు బ్యాక్ టు బ్యాక్ రిలీజెస్. కానీ ప్రచారం మాత్రం ఒకేసారి ప్రారంభమైంది. దీంతో అటు కొత్త సినిమా షూటింగ్స్ కు వెళ్లలేక, ఇటు ప్రచారంలో పాల్గొనలేక భలే ఇబ్బంది పడుతోంది రాశిఖన్నా.

రాశి నటించిన ప్రతిరోజూ పండగ సినిమా 20న విడుదలవుతుంది. ఈ సినిమా ప్రచారాన్ని నిన్నట్నుంచి ప్రారంభించారు. ఇదేదో మీడియాను పిలిచి ఇంటర్వ్యూలు ఇచ్చే టైపు ప్రచారం కాదు, ఏకంగా బస్సు యాత్ర. ఇప్పటికే మొదలైంది. ఈరోజు రాత్రికి బెజవాడ చేరుకుంటుంది. ఇప్పుడు కాకపోతే నెక్ట్స్ యాత్రలోనైనా రాశి పాల్గొనాల్సి ఉంది. ఆమెకిది కాస్త కష్టమైన పనే.

ఇటు వెంకీమామ రిలీజ్ కూడా దగ్గరపడింది. ఊహించని విధంగా 13వ తేదీకే ఈ సినిమా విడుదలను ఫిక్స్ చేశారు. అంటే ఇంకా 4 రోజులే టైమ్ ఉంది. గమ్మత్తుగా వీళ్లు కూడా బస్సు యాత్ర లాంటిదే ఫిక్స్ చేశారు. ఆల్రెడీ బస్సులో అంతా ఖమ్మం వెళ్లి ప్రీ-రిలీజ్ ఫంక్షన్ జరిపారు. అక్కడితో ఆగకుండా రిలీజ్ తర్వాత కూడా ఈ యాత్ర కొనసాగుతుందని ప్రకటించారు. సక్సెస్ మీట్ కూడా బస్సులోనే అంటూ ప్రకటించాడు వెంకీ.

ఇలా ఒకేసారి రెండు సినిమాల ప్రచారాలు ప్రారంభమవ్వడంతో రాశికి డేట్స్ ఎడ్జెస్ట్ చేయడం కష్టంగా మారింది. ఆమె తన అప్ కమింగ్ మూవీస్ షూటింగ్స్ కు ఇప్పటికే డేట్స్ ఇచ్చింది. ఈ ప్రచారం, ఆ డేట్స్ తో క్లాష్ అవుతోంది.