చిరంజీవి సరసన ఛాన్స్ మిస్

Raasi Khanna says she missed the chance to act with Chiranjeevi
Friday, May 22, 2020 - 10:00

కొంతమంది హీరోలకు బంగారం లాంటి అవకాశాలు ఇలా వచ్చి అలా చేజారిపోతుంటాయి. ఆ ఒక్క సినిమా చేసి ఉంటే వాళ్ల కెరీర్ మరో రేంజ్ లో ఉండేది. ఫలానా సూపర్ హిట్ సినిమాలో ఛాన్స్ మిస్సయిందని హీరోయిన్లు బాధపడుతూ చెప్పిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇప్పుడలాంటిదే తన కెరీర్ లో ఎదురైన అనుభవాన్ని చెప్పుకొచ్చింది ఒకప్పటి హీరోయిన్ రాశి.

తెలుగులో ఒకప్పుడు వెలిగిన ఈ హీరోయిన్, అప్పటి స్టార్ హీరోలతో మాత్రం పెద్దగా సినిమాలు చేయలేకపోయింది. ఒక దశలో ఏకంగా చిరంజీవి సరసన నటించే ఛాన్స్ కూడా వచ్చిందని, కానీ అనుకోని కారణాల వల్ల ఆ సినిమా ఆగిపోయిందని చెప్పుకొచ్చింది. అప్పట్లో పత్రికల్లో కూడా వచ్చిన ఈ మేటర్ పై ఇంతకంటే ఎక్కువ స్పందించడం తనకు ఇష్టం లేదని, సినిమా డీటయిల్స్ చెప్పనని అంటోంది రాశి.

చిరంజీవితో సినిమా చేసి ఉంటే తన కెరీర్ పీక్ స్టేజ్ కు వెళ్లి ఉండేదని, హీరోయిన్ గా మరో ఐదేళ్లు కొనసాగి ఉండేదాన్ని బాధపడింది రాశి. అయితే చిరంజీవి సరసన ఛాన్స్ రాకపోయినా.. చిరంజీవి తమ్ముడు పవన్ కల్యాణ్ సరసన నటించే ఛాన్స్ వచ్చిందని.. ఆ క్రెడిట్ మొత్తం చిరంజీవి భార్య సురేఖకు చెందుతుందని తెలిపింది రాశి. కేవలం సురేఖ చెప్పడం వల్ల గోకులంలో సీత సినిమాలో తనను హీరోయిన్ గా తీసుకున్నారని తెలిపింది.

మరోవైపు తను లావెక్కడం వల్లనే యాక్టింగ్ కెరీర్ కు దూరమయ్యాననే వార్తల్ని రాశి ఖండించింది. తను కావాలనే గ్యాప్ తీసుకున్నానని, లావెక్కడ వల్ల తనకు అవకాశాలు తగ్గలేదని వాదించింది.