రివ్యూలపై రఘు ఆవేదన

Raghu Kunche reacts to low ratings to 47 Days
Wednesday, July 1, 2020 - 17:30

"47 డేస్"... . రీసెంట్ గా ఓటీటీలోకి వచ్చిన ఈ సినిమాకు రఘు కుంచె కేవలం మ్యూజిక్ డైరక్టర్ మాత్రమే కాదు. నిర్మాత కూడా. అంతేకాదు.. ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయడానికి బాగా కష్టపడిన వ్యక్తి కూడా ఇతడే. అలాంటి సినిమాపై నెగెటివ్ రివ్యూస్ వచ్చేసరికి ఈ సంగీత దర్శకుడు కమ్ నిర్మాత తట్టుకోలేకపోయాడు. తన ఆవేదనను సోషల్ మీడియాలో బయటపెడుతున్నాడు.

రూపాయి పెట్టి సినిమా తీసిన నిర్మాత ఆ రూపాయి వస్తుందా  రాదా అని బేల ముఖం వేసుకుని చూస్తుంటే... Netflix లో 10 రూపాయిల సినిమాతో పోల్చుకుని, ఈ రూపాయి సినిమాని సొంత వేళ్ళతో  పొడిచేస్తున్నారని రఘు ఆవేదన వ్యక్తంచేశాడు.

నలుగురికి అన్నం పెట్టి, తను ఓ ముద్ద తినాలనుకునే నిర్మాత బిక్కుబిక్కుమనుకునేలా, రివ్యూలతో మానసికంగా చచ్చిపోయేలా చేస్తున్నారని రఘుకుంచె బాధపడ్డాడు. కరోనా వల్ల ఇండస్ట్రీ అంతా బాధపడుతున్న ఈ ప్రత్యేక పరిస్థితుల్లోనైనా కాస్త మనసుపెట్టి ఆలోచించాలని కోరాడు.

థియేటర్లలో రిలీజై ఉంటే ఈ పాటికి తమ సినిమా సంక నాకిపోయేదని, ఓటీటీలో రిలీజ్ అవ్వడం వల్ల తట్టుకొని నిలబడిందని, సామాన్య ప్రేక్షకులు సినిమాను లైక్ చేస్తున్నారని రాసుకొచ్చాడు రఘు కుంచె.