ఊగిసలాడుతున్న రాజ్ తరుణ్

Raj Tarun's Orey Bujjigaa may skip theatrical release
Monday, June 1, 2020 - 15:45

"నిశ్శబ్దం" తర్వాత ఓటీటీ గురించి ఓ రేంజ్ లో చర్చ జరుగుతున్న మూవీ "ఒరేయ్ బుజ్జిగా". రాజ్ తరుణ్ ట్రాక్ రికార్డ్ ను దృష్టిలో పెట్టుకొని ఈ సినిమాను థియేట్రికల్ రిలీజ్ కంటే ముందే ఓటీటీకి ఇచ్చేస్తారంటూ ప్రచారం జరుగుతోంది. అటు నిర్మాత రాధామోహన్, తమ సినిమాను ఓటీటీకి ఇవ్వమని.. థియేట్రికల్ గా రిలీజ్ చేస్తామని పత్రికాముఖంగా ప్రకటించినప్పటికీ ఎందుకో ఈ పుకార్లు ఆగడం లేదు.

ఆల్రెడీ రాజ్ తరుణ్ కు మార్కెట్ పడిపోయింది. దీనికి తోడు లాక్ డౌన్ పడింది. థియేటర్లు ఓపెన్ అయిన తర్వాత చాలా ముందుజాగ్రత్త చర్యలు తీసుకోబోతున్నారు. మరీ ముఖ్యంగా ఆక్యుపెన్సీని సగానికి సగం తగ్గిస్తారు. ఇలాంటి టైమ్ లో "ఒరేయ్ బుజ్జిగా" ప్రీ-రిలీజ్ బిజినెస్ పూర్తిచేయడం నిర్మాతకు తలకుమించిన భారంగా మారుతోంది.

నిర్మాత ఆశించిన స్థాయిలో ప్రీ-రిలీజ్ బిజినెస్ జరిగినా.. థియేటర్లలో తగ్గబోతున్న ఆక్యుపెన్సీ నేపథ్యంలో రాజ్ తరుణ్ సినిమా లాభాల బాట పడుతుందని చెప్పలేం. ఇవన్నీ పక్కనపెడితే.. ఆ సినిమా థియేటర్లలోకి వచ్చేలోపు నిర్మాతకు వడ్డీలు తడిసిమోపెడవుతాయి.

ఇవన్నీ కనిపిస్తున్న వాస్తవాలు. అందుకే "ఒరేయ్ బుజ్జిగా" సినిమా థియేటర్ ను మిస్ కొట్టి ఓటీటీలోకి వచ్చే ఛాన్స్ ఉందంటూ పుకార్లు వస్తున్నాయి. ఆ పుకార్లకు మరింత ఊతమిస్తూ.. చాలా ఓటీటీ కంపెనీలు నిర్మాత రాధామోహన్ తో చర్చలు షురూ చేశాయి. దీంతో అటు థియేటర్ కు వెళ్లాలా  ఇటు ఓటీటీకి వెళ్లాలా అనే డైలమాలో ఊగిసలాడుతోంది రాజ్ తరుణ్ సినిమా.