ఆ పబ్లిసిటీ స్కిల్స్ ఇక్కడ వాడొచ్చు కదా

Rajamouli and team not responding about corona charity
Wednesday, April 1, 2020 - 14:00

బాహుబలితో దర్శకుడిగా జాతీయ స్థాయి మార్కెట్ ను సొంతం చేసుకున్న దర్శకుడు రాజమౌళి. ఆ సినిమాతోనే పద్మశ్రీ పురస్కారం అందుకొనే స్థాయికి వెళ్లారు. తన సినిమాను మార్కెట్ చేసుకోవడంలో రాజమౌళిని మించినవాళ్లు ఎవరూ ఉండరు. నిజానికి బాహుబలికి మీడియాలో లభించిన ప్రచారాన్ని పైసల్లోకి కన్వర్ట్ చేస్తే వందల కోట్లు అయ్యేవి. ప్రచారానికి పైసా ఖర్చు చేయకుండా (ఒక్క హిందీ మీడియాకు మాత్రం కాసింత ఖర్చుపెట్టారు అని టాక్) ఫ్రీ పబ్లిసిటీ పొందడానికి ఎన్నో వ్యూహాలు పాటించారు. ఇక తెలుగు మీడియాను కనీసం దగ్గరకు రాకుండా చూసుకొన్నారు. అయినా ఎగబడి ఎగబడి వార్తలు రాశారు. చివరకు బాహుబలి చూడకపోవడం అంటే పుష్కరాల స్నానం చేయనంత పాపం అన్న స్థాయిలో మీడియా ఓవర్ యాక్షన్ చేసింది. 

ఇక ఏ సందర్భం అయినా తనకు తగ్గట్టు వాడేసుకుంటుంది జక్కన్న అండ్ ఫ్యామిలీ. ఇప్పుడు కరోనా వచ్చింది. షూటింగ్ లేదు.... వేరే పనీ లేదు. జనం సినిమాల గురించి ఆలోచించే మూడ్ లో లేరు. అంతే... తన సినిమా టైటిల్ వదులుతున్నాను... మోషన్ పోస్టర్ వస్తుంది అంటూ సోషల్ మీడియాలో ప్రచారానికి కొబ్బరికాయ కొట్టాడు జక్కన్న. టైటిల్ వచ్చింది... దానిపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వచ్చే ప్రమాదం ఉందని గ్రహించి భజన స్పీడ్ పెంచారు. ఈలోగా రాంచరణ్ బర్త్ డే వచ్చింది. ఓ ట్రైలర్ వదిలారు. మొత్తానికి కరోనా సీజన్ లో తన పబ్లిసిటీ సందడితో జక్కన్న హడావిడి చేశారు. మే 20న జూనియర్ ఎన్టీఆర్ బర్త్ డే కి చరణ్ తో వాయిస్ ఓవర్ చెప్పించి ఇంకో ట్రైలర్ వదులుతారు. 

సామాజిక బాధ్యత ఏది?

సందర్భాన్ని వాడుకొని ప్రచారం చేసుకోవడం ఓ కళ... ఓ నైపుణ్యం అనుకొందాం. తననో అగ్ర దర్శకుడిగా నిలిపిన సమాజం కష్టాల్లో ఉంటే స్పందించాల్సిన బాధ్యత జక్కన్నకీ... అతనికి కుటుంబానికి ఉంటుంది. అయితే ఆ వైపు ఏమీ ఆలోచన చేసినట్లు లేదు. గుప్త దానాలు చేశారు అనుకొందామన్నా... వారి ప్రతినిధులు ఆ విషయాన్ని మీడియాకు కచ్చితంగా లీక్ చేసి ఉండేవారు. రాజమౌళి చెప్పుకోవడానికి ఇష్టపడలేదుగానీ ఫలానా విధంగా సాయం చేశారు అని చెప్పేవారు. సెలబ్రిటీలు సాయం చేయడం వెనక కొంత మేరకు ప్రచార కాంక్ష ఉండవచ్చు. అయితే వాళ్ళు దానం చేయడం.. దానికి ప్రచారం రావడం వల్ల జనంలో ఒక కదలిక వస్తుంది. మనమూ ఎంతోకొంత చేద్దాం అని ముందుకు వస్తారు. ప్రచారం చేసి జనాన్ని థియేటర్లకు రప్పించుకొనే తెలివితేటలు ఉన్న రాజమౌళి – కష్టాల్లో ఉన్న సమాజానికి అండగా నిలిచి సినీ ప్రియులను ఎందుకు ఆ దిశగా నడిపించడం లేదు?