తెలుగు సినీ మీడియా కరివేపాకు!

Rajamouli distancing from Telugu media
Tuesday, November 13, 2018 - 17:00

రాజకీయ నాయకులైనా... సినిమా సెలబ్రిటీలైనా మీడియా ద్వారా ప్రచారం లేకపోతే ప్రజల్లోకి వెళ్లలేము అని బలంగా నమ్ముతారు. మనసులో ఎలా ఉన్నా మీడియాను చేరదీసి తమకు సంబంధించిన వార్తలు వచ్చేలా చూసుకొంటారు. అది వ్యతిరేకమైనా, అనుకూలమైనా ఏదొకలా వార్తల్లో ఉండాలని నాయకులు భావిస్తారు. ఎప్పుడూ తమను పొగుడుతూ చిడతలు కొట్టేలా వార్తలు ఇవ్వాలని సినీ జనాలు కోరుకొంటారు. సినిమాకు కొబ్బరికాయ కొట్టక ముందు నుంచి వెండి తెర మీద బొమ్మపడి పది రోజులు నిలబడేవరకూ ఆ బొమ్మ గురించి దిమ్మ తిరిగే కవరేజి కోసం తపిస్తుంటారు. కానీ ప్రముఖ దర్శకుడు రాజమౌళికి మాత్రం తెలుగు మీడియాపై కొంత చుల‌క‌న భావం ఏర్ప‌డింద‌ట‌.

ఈ మాట ఈ మ‌ధ్య త‌రుచుగా వినిపిస్తోంది. ఆయ‌న తాజా చిత్రం ఆర్‌.ఆర్‌.ఆర్ ప్రారంభోత్స‌వంతో పాటు బాహుబ‌లి సినిమాల విష‌యంలో లోక‌ల్ మీడియాకి ఇంపార్టెన్స్ ఇవ్వ‌లేదు.

రాజ‌మౌళి సినిమా అంటే ఇపుడు జ‌నంలో క్రేజ్‌. ఆయ‌న సినిమాల గురించి తెలుసుకోవాల‌ని జ‌నంకి కూడా ఆస‌క్తి ఉంది. కాబ‌ట్టి  తమకు మీడియాతో ఎలాంటి పని, ప్రయోజనం లేదని రాజమౌళితోపాటు ఆయన టీమ్ బలంగా విశ్వసిస్తుందనేది ఒక టాక్‌.

రాజమౌళి తెలుగు సినీ మీడియాని ఆమడ దూరం పెట్టడం అనేది బాహుబలి హిట్ నుంచి వచ్చిన ట్రెండ్ అని అనుకొంటే పొరబాటే. తొలి నుంచీ ఉన్నదే. ఛత్రపతి, విక్రమార్కుడు సినిమాల సమయంలోనూ కొందరు తెలుగు సినీ జర్నలిస్టులతో రాజమౌళి సున్నం పెట్టుకున్నారు. యమదొంగ సినిమా సమయంలో వాళ్ళు ఏదైనా నెగెటివ్ చేస్తారేమో అని జక్కన్న ఫ్యామిలి కంగారుపడింది (ఎందుకంటే జక్కన అండ్ ఫ్యామిలీకి అందులో భాగం ఉంది మరి). కీరవాణి భార్య వల్లీ క‌ల‌గ‌చేసుకొని మీడియాకి గౌర‌వం ఇచ్చారు. రాజ‌మౌళిని మీడియాకి చేరువ చేశారు.

తమకు కావల్సిన పత్రికలు, ఛానెల్స్ సినీ హెడ్స్, రిపోర్టర్స్ కు మాత్రమే టచ్ లో ఉండేవారు. తమకు ఎప్పుడు ఎలా కావాలంటే అలాంటి న్యూస్ ఇచ్చుకొనేవారు. ఈగ సినిమా సమయంలో తెచ్చుకున్న హాలీవుడ్ కెమెరామెన్ రాజమౌళితో గొడ‌వ‌ప‌డి వెళ్ళిపోయిన విషయం తెలిసినా మీడియా గమ్మునే ఉంది. ఆ స్థాయిలో రిలేషన్ నడిచింది అపుడు.

బాహుబలి మొదలయ్యాక సన్నిహిత మీడియా వారిని కూడా కట్ చేసి పడేశారు. మేము ఇచ్చే స్టిల్స్, వీడియో క్లిప్స్, మేకింగ్ వీడియోస్ మీకు మహా ప్రసాదం... అన్న‌ట్లుగా ప్ర‌వ‌ర్తించ‌డం మొద‌లుపెట్టారు. బాహుబలి న్యూస్ వేయకపోతే మహాపరాధం అన్నట్లు మీడియా మేనేజిమెంట్లు కూడా వ్యవహరించడంతో రాజమౌళి టీమ్ కి తెలుగు మీడియా మరింత చులకన అయ్యింది. మీడియాను దూరంగా గెంటేసే ఈయన బాలీవుడ్ మీడియాకు మాత్రం రెడ్ కార్పెట్ పరుస్తారు.

కొత్త చిత్రం ప్రారంభం... అందునా రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, చరణ్ కలిసి చేస్తున్న సినిమా అనేసరికి క్రేజ్ ఉంటుంది. ఈ సినిమా ఓపెనింగ్ కి  మీడియాను పిలవాలని నిర్మాత ఉత్సాహపడ్డా రాజమౌళి ససేమిరా అన్నారట. ఈ ప్రాజెక్ట్ లో నిర్మాత దానయ్య చెల్లుబాటు కాదు అని అందరికీ తెలుసు. కనీసం ముహూర్తం రోజైనా ఆయన మాటకు విలువ ఉంటుందని అనుకున్నారు.

రాజమౌళి ఈ రోజు ఇండియా గ‌ర్వించ‌ద‌గ్గ ద‌ర్శ‌కుడే కావొచ్చు కానీ ఆయ‌న కెరియ‌ర్ ప్రారంభంలో ప‌క్కా మాస్ చిత్రాలు తీసిన టైమ్‌లోనూ తెలుగు మీడియా ఆయ‌నకి అండ‌గా నిలిచింది.  విక్రమార్కుడులో సీన్లు కన్నడ సినిమా నుంచి (దాని దర్శకుడు తెలుగువాడే.. కె.ఎస్.నాగేశ్వర రావు) మక్కీకిమక్కీ ఎత్తేశారు అని చూపించినా – ఏనాడూ రాజమౌళిని తెలుగు మీడియా విమ‌ర్శించ‌లేదు.  వినయంతో కూడిన గౌరవం వల్ల కలిగిన భక్తితో వచ్చిన భయంతో ప్రశ్నించలేదు. అయినా రాజమౌళి తెలుగు మీడియాను విసిరి కొట్టేస్తారు.