రాజమౌళి ఓ బొమ్మరిల్లు ఫాదర్

Rajamouli liks Bommarillu father
Tuesday, November 5, 2019 - 23:00

బొమ్మరిల్లు సినిమాలో తండ్రి క్యారెక్టర్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. తన కుటుంబానికి ఏం కావాలో అందులో తండ్రి అడగడు, వాళ్లకు తగ్గట్టు అన్నీ తనే సిద్ధం చేసేస్తుంటాడు. మరీ ఇంత కాకపోయినా దాదాపు రాజమౌళి కూడా ఈ టైపే అంటున్నాడు మాటల రచయిత బుర్రా సాయిమాధవ్. అదేదో నెగెటివ్ సెన్స్ లో కాదులెండి, రాజమౌళిని పొగుడుతూనే అన్నాడు. రాజమౌళి ఎలాంటి వాడో సాయిమాధవ్ మాటల్లో వింటే ఎవరికైనా బొమ్మరిల్లు ఫాదర్ క్యారెక్టర్ గుర్తురాక మానదు.

సినిమా విషయంలో రాజమౌళిని చాలా స్పష్టత ఉన్న దర్శకుడిగా చెబుతున్నాడు బుర్రా. అతడు తన మైండ్ లో RRR సినిమాను ఇప్పటికే ఎన్నోసార్లు చూసేశాడట. అది జనాలకు చూపించే ప్రయత్నం మాత్రం చేస్తున్నాడట. ఏ సీన్ లో ఎంత డైలాగ్ ఉండాలో ఆయనకు బాగా తెలుసని, జస్ట్ ఆయన చెప్పింది అర్థం చేసుకొని, ఆత్మను పట్టుకోగలిగితే చాలంటున్నాడు. అలా రచయితకు సగం పని తగ్గించేస్తాడట రాజమౌళి.

RRRకు మాటలు అందిస్తున్న బుర్రా.. సినిమాలో ఇద్దరు స్టార్ హీరోలు ఉన్నప్పటికీ కథను బట్టే డైలాగ్స్ ఉంటాయంటున్నాడు. వాళ్ల స్టార్ డమ్ కు తగ్గట్టు చాలా కొద్ది డైలాగ్స్ మాత్రమే ఉంటాయట. ఇలా డైలాగ్స్ కు సంబంధించి సగం పని రాజమౌళే పూర్తిచేసేశాడట. ఇప్పుడు చెప్పండి, బుర్రా మాటలు వింటే రాజమౌళిలో మనకు ఓ బొమ్మరిల్లు ఫాదర్ క్యారెక్టర్ కనిపిస్తోంది కదా!