RRR స్క్రిప్ట్ మార్చలేదు: రాజమౌళి

Rajamouli is not ruling out Jan 8 date yet
Tuesday, May 12, 2020 - 22:15

"ఆర్ఆర్ఆర్" రిలీజ్ పై రాజమౌళి మరోసారి క్లారిటీ ఇచ్చాడు. లాక్ డౌన్ వల్ల తాము పెట్టుకున్న బఫర్ టైమ్ అయిపోయిందని, అయినప్పటికీ మించిపోయిందేం లేదంటున్నాడు. త్వరలోనే షూటింగ్స్ కు అనుమతి ఇస్తే చెప్పిన టైమ్ కే  ఆర్ఆర్ఆర్ ను థియేటర్లలోకి తీసుకొస్తానని చెబుతున్నాడు.

"డ్యూరేషన్ పరంగా చూసుకుంటే జనవరి 8 అంటే చాలా టైమ్ ఉన్నట్టు. అది నిజమే. షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ కాకుండా మేం బఫర్ టైమ్ పెట్టుకున్నాం. ఈ లాక్ డౌన్ వల్ల ఆ బఫర్ టైమ్ అయిపోయింది. దీంతో షెడ్యూల్స్ టైట్ అయ్యాయి. కనీసం వచ్చే నెలకైనా షూటింగ్స్ కు అనుమతి వస్తే.. చెప్పిన తేదీకే సినిమాను సిద్ధం చేస్తాం."

స్క్రిప్ట్ లో మార్పులు చేసినట్టు వచ్చిన వార్తల్ని ఖండించాడు రాజమౌళి. ఇంతకుముందు లాక్ చేసిన స్క్రిప్ట్ తోనే సెట్స్ పైకి వెళ్తామని స్పష్టంచేశాడు. తన కెరీర్ లో బాగా ఇబ్బందిపెడుతున్న ప్రాజెక్టుగా ఆర్ఆర్ఆర్ ను చెప్పుకొచ్చాడు.

"నా కెరీర్ లో ఇంత డిఫికల్ట్ టైమ్ చూడలేదు. నేను బాగా ఇబ్బంది పడుతున్న ప్రాజెక్టు ఇదే. టైమ్ తక్కువగా ఉండడం వల్ల స్క్రిప్ట్ లో మార్పులు చేశానని అంతా అనుకుంటున్నారు. అది నాకు ఇష్టం ఉండదు. స్క్రిప్ట్ లో ఎలాంటి మార్పులు చేయడం లేదు. ఇంతకుముందు లాక్ చేసిన స్క్రిప్ట్ ప్రకారమే వెళ్తాం."

షూటింగ్స్ కు ఎప్పుడు అనుమతిస్తారు.. ఎంతమందిని అనుమతిస్తారు.. ఎలాంటి కండిషన్స్ పెడతారు లాంటి అంశాల మీద తమ సినిమా రిలీజ్ డేట్ ఆధారపడి ఉంటుందని.... సెట్స్ పైకి వెళ్లిన తర్వాత కానీ రిలీజ్ డేట్ పై పూర్తి స్పష్టత రాదని అంటున్నాడు రాజమౌళి.