తారక్ స్పైడర్ మేన్.. చరణ్ సూపర్ మేన్

Rajamouli reveals base for RRR
Monday, March 30, 2020 - 19:45

ఆర్ఆర్ఆర్ కథ ఎలా పుట్టింది? అసలు ఈ ఆలోచన ఎక్కడ్నుంచి ప్రారంభమైంది? దీనికి రాజమౌళి సమాధానం ఇచ్చాడు. చరిత్రకు చెందిన ఇద్దరు వ్యక్తులు ఒకే కాలంలో కలిస్తే ఎవరికైనా థ్రిల్ ఉంటుందని, తను థ్రిల్ గా ఫీలైన ఆ అంశాన్ని అందరికీ అందించాలనే ఉద్దేశంతోనే ఆర్ఆర్ఆర్ ను స్టార్ట్ చేశానని అంటున్నాడు.

"చిన్నప్పుడు నేను కామిక్ బుక్స్ చదివినప్పుడు స్పైడర్ మేన్-సూపర్ మేన్ కలిస్తే బాగుంటుంది కదా అనుకునేవాడ్ని. అలాగే భీమ్-హనుమాన్ కలిస్తే చాలా బాగుంటుంది కదా అనుకునేవాడ్ని. డిఫరెంట్ టైమ్ లైన్స్ కు చెందిన ఇద్దరు హీరోలు ఒకే కాలంలో కలిస్తే చూడ్డానికి చాలా బాగుంటుంది కదా. ఆర్ఆర్ఆర్ కథ  పుట్టడానికి మూల కారణం ఇదే."

నందమూరి హీరోలు, మెగా కాంపౌండ్ హీరోల మధ్య దశాబ్దాలుగా ఫ్యాన్ వార్ నడుస్తున్న విషయాన్ని అంగీకరించిన రాజమౌళి.. ఆర్ఆర్ఆర్  విషయంలో మాత్రం తనకు ఆ సమస్య ఎదురుకాదంటున్నాడు. పైగా చరణ్-తారక్ ఇద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ కావడం తనకు ప్లస్ అవుతుందంటున్నాడు.

"చరణ్-తారక్ ఇద్దరూ సంప్రదాయబద్ధంగా ఫ్యాన్ వార్ ఉన్న రెండు కుటుంబాలకు చెందిన హీరోలు. కానీ వాళ్లిద్దరూ మంచి ఫ్రెండ్స్. ఇంతకుముందు నేను ఈ ఇద్దరితో పనిచేశాను. ఇప్పుడు వాళ్లిద్దర్నీ కలిపి సినిమా తీసే టైమ్ కలిసొచ్చింది. ఆర్ఆర్ఆర్ తో నాకు ఆ అవకాశం దక్కింది. నేను అనుకోవడం ఈసారి ఫ్యాన్ వార్ ఉండదు. చరణ్ ఇంట్రడక్షన్ టీజర్ కు తారక్ వాయిస్ పెట్టడానికి కూడా ఇదే కారణం."

కేవలం తారక్ ఫ్యాన్స్, చరణ్ ఫ్యాన్స్ కోసం తను ఆర్ఆర్ఆర్ తీయడం లేదని.. కోట్లాది మంది జనరల్ పబ్లిక్ కోసం ఈ సినిమా తీస్తున్నానని స్పష్టంచేసిన రాజమౌళి.. సేమ్ టైమ్ ఫ్యాన్స్ కూడా ఎంజాయ్ చేసేలా సినిమా ఉంటుందని స్పష్టంచేశాడు.